US-India trade tensions : పెద్దన్న అని పిలిపించుకునే అమెరికాది పెద్ద మనసు కాదు, కేవలం వ్యాపార మనస్తత్వం మాత్రమే. తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం ఏ దేశాన్నైనా ఇబ్బందులకు గురిచేయడానికి వెనుకాడదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆశ్చర్యకరంగా, తన అసలైన ఆర్థిక ప్రత్యర్థులతో తలపడినప్పుడల్లా… మధ్యలో నష్టపోయేది మాత్రం మన భారతదేశమే. ఇది నిన్న మొన్నటి ముచ్చట కాదు, దాదాపు మూడున్నర దశాబ్దాలుగా పునరావృతమవుతున్న చారిత్రక సత్యం. 1980లలో జపాన్‌పై గురిపెట్టినా, 2025లో చైనాను లక్ష్యంగా చేసుకున్నా… మధ్యలో దెబ్బతిన్నది మాత్రం మనమే. ఇంతకీ అగ్రరాజ్యం ఎందుకిలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది..? అసలు శత్రువును వదిలేసి, మిత్రదేశమైన భారత్ మెడకు ఎందుకు పదేపదే ఉచ్చు బిగిస్తోంది..? ఈ వాణిజ్య వ్యూహాల వెనుక ఉన్న అసలు కథేంటి..?
గతం పునరావృతం: అప్పుడు జపాన్.. ఇప్పుడు చైనా.. మధ్యలో బలిపశువు భారత్!
అగ్రరాజ్యం అమెరికా వాణిజ్య విధానాలను అర్థం చేసుకోవాలంటే మనం చరిత్ర పుటలను తిరగేయాలి. వారి తీరు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది – తమకు ఆర్థికంగా సవాలు విసిరే దేశాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు, ఆ క్రమంలో చేతకానప్పుడు లేదా పరిస్థితులు అనుకూలించనప్పుడు, పక్కనున్న అమాయకులను బలి చేస్తారు.
చారిత్రక తప్పిదం: “సూపర్ 301” కథ : 1980వ దశకంలో జపాన్ ఆర్థిక వ్యవస్థ అప్రతిహతంగా దూసుకుపోతోంది. టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలలో అమెరికాకు గట్టి పోటీనిస్తూ, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యంలో జపాన్‌కు బిలియన్ల కొద్దీ డాలర్ల మిగులు ఉండేది. ఇది సహజంగానే అమెరికాకు కంటగింపుగా మారింది.
ఈ నేపథ్యంలో, అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ ప్రభుత్వం 1988లో “ఓమ్నిబస్ ట్రేడ్ అండ్ కాంపిటీటివ్‌నెస్ యాక్ట్” ద్వారా అమెరికా ట్రేడ్ యాక్ట్‌లోని “సెక్షన్ 301″కు పదును పెట్టింది. ఇదే Famusగా “సూపర్ 301″గా ప్రసిద్ధి చెందింది. దీని ముఖ్య ఉద్దేశం… అసమంజస వాణిజ్య విధానాలు అవలంబిస్తున్న దేశాలపై ఏకపక్షంగా ఆంక్షలు విధించడం. లక్ష్యం స్పష్టంగా జపానే అయినప్పటికీ, 1989 మేలో అమెరికా విడుదల చేసిన జాబితాలో జపాన్, బ్రెజిల్‌తో పాటు భారతదేశం పేరును కూడా చేర్చింది. చిత్రమేమిటంటే, అప్పట్లో అమెరికాతో వాణిజ్యంలో మనకు కేవలం 690 మిలియన్ డాలర్ల మిగులు మాత్రమే ఉండేది. అయినా, రాజీవ్ గాంధీ, ఆ తర్వాత వి.పి. సింగ్ ప్రభుత్వాలు అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గలేదు. చివరికి, జపాన్, బ్రెజిల్‌లను జాబితా నుంచి తొలగించినా, భారత్‌పై మాత్రం ఆంక్షల కత్తిని కొంతకాలం వేలాడదీశారు.
వర్తమానంలో అదే కథ: చైనాపై గురి.. భారత్‌కు దెబ్బ : దాదాపు 35 ఏళ్ల తర్వాత, 2025లో చరిత్ర మళ్లీ పునరావృతమైంది. ఈసారి అమెరికా లక్ష్యం చైనా. తమ తయారీ రంగాన్ని చైనా దెబ్బతీస్తోందని, వాణిజ్యంలో అపారంగా లాభపడుతోందని ఆరోపిస్తూ, నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై టారిఫ్‌ల యుద్ధం (సుంకాల యుద్ధం) ప్రకటించారు. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
భారీ వాణిజ్య మిగులు ఉన్న చైనాకు పలు మినహాయింపులు ఇస్తూ, సుంకాల అమలుకు గడువు పెంచిన ట్రంప్ సర్కార్, భారత్‌పై మాత్రం కఠినంగా వ్యవహరించింది. వాణిజ్య చర్చలను నిలిపివేసి, ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. రష్యా నుంచి చమురును భారత్, చైనా రెండు దేశాలూ కొనుగోలు చేస్తున్నా, అగ్రరాజ్యం కేవలం మనల్నే లక్ష్యంగా చేసుకుంది. చైనాపై ఆంక్షలు విధిస్తే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతాయనే సాకుతో వారికి 90 రోజుల మినహాయింపు ఇచ్చింది. ఇది అమెరికా అనుసరిస్తున్న పచ్చి పక్షపాత వైఖరికి నిలువుటద్దం.
ఈ చర్యలను అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్డన్ తీవ్రంగా విమర్శించారు. చైనా పట్ల ఉదారంగా, భారత్ పట్ల కఠినంగా వ్యవహరించడం వల్ల… “రష్యా, చైనాల నుంచి భారత్‌ను దూరం చేయడానికి దశాబ్దాలుగా అమెరికన్లు పడిన శ్రమ వృథా అయ్యింది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సంస్కరణలతో నిలబడ్డ భారత్ : అమెరికా ఎన్ని అడ్డంకులు సృష్టించినా, 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వం, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ నేతృత్వంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో భారతదేశం ప్రపంచ యవనికపై తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఈ చరిత్ర మొత్తం గమనిస్తే, అమెరికా తన అసలైన పోటీదారులతో పోరాటం మొదలుపెట్టి, చివరికి ఆ ప్రభావం సంబంధం లేని భారత్ వంటి వర్ధమాన దేశాలపై చూపుతోందని స్పష్టమవుతోంది. “సూపర్ 301” దీనికి బలమైన చారిత్రక సాక్ష్యం.


