Joy Bangla Slogan: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం వేడి మీద ఉంది. రాష్ట్రంలో విపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన ర్యాలీలో ‘జోయ్ బంగ్లా’ అనే నినాదం వినిపించగానే, దానిపై స్పందిస్తూ ఒక వ్యక్తిని ఉద్దేశించి “తోలు తీస్తా” అంటూ తీవ్ర స్థాయిలో బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Just two words are enough to rattle @BJP4India to its core: Joy Bangla! pic.twitter.com/Uq2ZaKKLM3
— All India Trinamool Congress (@AITCofficial) July 30, 2025
పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలో జరిగిన ఒక ర్యాలీలో సువేందు అధికారి మాట్లాడుతుండగా, సభకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి ‘జోయ్ బంగ్లా’ అని నినాదం చేశాడు. ఈ నినాదం బంగ్లాదేశ్‌తో ముడిపడి ఉందని, భారత్‌లో దీనికి చోటు లేదని బీజేపీ నాయకులు తరచుగా విమర్శిస్తుంటారు. నినాదం వినిపించగానే ఆగ్రహించిన సువేందు అధికారి, “మీ నాయకుడు ఇక్కడ ఉన్నాడా? నీ పేరు రాసుకున్నాను. తోలు తీసి పారేస్తా. గుర్తుపెట్టుకో” అంటూ ఆ వ్యక్తిని నేరుగా హెచ్చరించారు. అయితే భాజపా పాలిత రాష్ట్రాల్లో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని, దానిపై నిరసగానే తాను జోయ్ బంగ్లా అంటూ నినదించినట్లు సదరు వ్యక్తి తెలిపారు.
సువేందు అధికారి చేసిన ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్ర స్థాయిలో మండిపడింది. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి ఇలాంటి భాషను వాడటం సరికాదని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని టీఎంసీ నాయకులు విమర్శించారు. అయితే, తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ, దేశ వ్యతిరేక నినాదాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సువేందు అధికారి స్పష్టం చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది.


