Woman Deliver Child On Roadside: అత్యవసర పరిస్థితుల్లో సరైన సమయానికి రోగులకు వైద్య సేవలు అందేలా చూడాల్సిన అంబులెన్స్‌లు తమ సేవలను విస్మరిస్తున్నాయి. ఫలితంగా నిండు గర్భిణీ ప్రసవ నొప్పులతో ఆస్పత్రికి నడిచి వెళ్తూ మధ్యలోనే ప్రసవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారిక నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో మధ్యప్రదేశ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. కానీ అది మాటలకే పరిమితమని నిరూపించేలా తాజా ఘటన ఉదాహరణగా నిలిచింది. ఆధునిక వైద్య సదుపాయాల విషయంలో పేరుగాంచిన ఉన్నత స్థాయి జిల్లా విదిషలో రోడ్డు పక్కన టార్చిలైటు వెలుగులో బిడ్డను ప్రసవించింది నిండు గర్భిణీ..
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల తెల్లవారుజామున 3 గంటల సమయంలో గర్భిణీకి తీవ్రమైన ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబీకులు 108 అంబులెన్స్ సేవకు పదే పదే ఫోన్లు చేశారు. దాదాపు మూడు గంటలు వేచి చూసినప్పటికీ.. అంబులెన్స్ రాకపోవడం, సమీపంలో వైద్య సహాయం కూడా లేకపోవడంతో కుటుంబీకులు గందరగోళానికి గురయ్యారు.
మహిళ పరిస్థితి మరింత దిగజారడంతో వేరే దారి లేక కుటుంబీకులు ఆమెను నడిపిస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కొంతదూరం నడిచివెళ్లాక మధ్యలోనే ప్రసవ నొప్పులు తీవ్రం కావడంతో.. గ్రామస్థులు వెలుతురు కోసం టార్చి లైటు, టార్పాలిన్‌ను ఉపయోగించి పురుడు పోశారు. ప్రసవానంతరం నవజాత శిశువుతో దాదాపు మూడు గంటల పాటు రోడ్డుపైనే ఉండిపోయారు.
ఈ సంఘటనపై ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. గర్భిణీ కుటుంబీకులు అంబులెన్స్‌కు కాల్ చేశారని అధికారులు తెలిపారు. అయితే కాసేపటికి తిరిగి కాల్ చేశాక మహిళ ఫోన్ కలవలేదని స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్పారు. ఆస్పత్రి సమీపంలో గర్భిణీ ప్రసవించిందని సమాచారం అందిన తర్వాత సిబ్బంది అక్కడికి చేరుకుని తల్లీబిడ్డను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వివరించారు.
అయితే ఈ సంఘటన రాష్ట్రంలో అత్యవసర ఆరోగ్య సంరక్షణ ప్రతిస్పందన, ప్రసూతి భద్రత గురించి మరోసారి అసౌకర్య ప్రశ్నలను లేవనెత్తింది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

