Woman Tried To Open Plane Door : ఓ మహిళ చేయబోయిన పని అందరి వెన్నులో వణుకుపుట్టించింది. కొన్ని వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా ఓ మహిళ దేవుడు చెప్పాడంటూ విమానం డోర్ తీసేందుకు ప్రయత్నించింది. తోటి ప్రయాణికుడు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతడిని గట్టిగా కొరికింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
ఒహైయోలోని కొలంబస్ వెళ్లేందుకు టెక్సాస్‌లోని హ్యూస్టన్ నుండి ప్రయాణీకులతో శనివారం ఓ విమానం టేకాఫ్ అయ్యింది. కొద్ది సేపటి తరువాత 34 ఏళ్ల ఎలోమ్ అగ్బెనినో తన సీటు నుంచి లేచింది. విమానం ఎగ్జిట్ డోర్ వద్దకు వెళ్లి దానిని తదేకంగా చూస్తూ నిలబడింది. దీన్ని గమనించిన విమాన సిబ్బంది ఆమె వద్దకు వెళ్లి సీట్లో కూర్చోవాలని సూచించారు. అయితే.. ఎలోమ్ అందుకు నిరాకరించింది. తాను కిటికీలోంచి బయటకు చూస్తానని వారితో చెప్పింది. దీనికి సిబ్బంది అంగీకరించలేదు.
ఎలోమ్ వారిని నెట్టుకుంటూ వెళ్లి దేవుడు నన్ను ఒహైయో రమ్మన్నాడు. విమానం తలుపును తెరవాలని చెప్పాడంటూ ఎగ్జిట్ డోర్ హ్యాండిల్‌ను తెరిచేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో విమానం 37 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఘటనతో ప్రయాణీకులు భయాందోళనకు గురి అయ్యారు. ఓ ప్రయాణీకుడు ఆమెను ఆపేందుకు యత్నించగా అతడిని ఆమె గట్టిగా కొరికింది.
ఈ ఘటనతో అప్రమత్తమైన ఫైలట్ అర్కన్సాస్‌లోని బిల్ అండ్ హిల్లరీ క్లింటన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. అనంతరం ఎలోమ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. భర్తకు చెప్పకుండానే తాను ఒహైయోకు బయలుదేరినట్లు ఎలోమ్ చెప్పంది. ఆమె మానసిక స్థితి సరిగా లేనట్లుగా తెలుస్తోంది.