Women In Delhi Can Now Work Night Shifts: ఢిల్లీలో మహిళా ఉద్యోగులకు సంబంధించి కీలక సంస్కరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాజధానిలోని దుకాణాలు, వాణిజ్య సంస్థలలో మహిళా ఉద్యోగులు ఇకపై నైట్ షిఫ్టుల్లో పనిచేయడానికి అనుమతిస్తూ ఢిల్లీ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ALSO READ: Jaishankar UNO Response : స్వేచ్ఛా హక్కులపై భారత్ కు ఐక్యరాజ్యసమితి సూచన.. జై శంకర్ ఫైర్
ముఖ్యమంత్రి రేఖా గుప్తా జూలైలో ప్రకటించిన ఈ నిర్ణయాన్ని, తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ దుకాణాలు మరియు సంస్థల చట్టం, 1954 లోని నిబంధనలను సవరిస్తూ లేబర్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా నోటిఫై చేసింది.
భద్రత, సంక్షేమం తప్పనిసరి
కొత్త ఉత్తర్వు ప్రకారం, లిక్కర్ అవుట్‌లెట్‌లు మినహా అన్ని దుకాణాలు మరియు వాణిజ్య సంస్థలు రాత్రి వేళల్లో మహిళలను నియమించుకోవచ్చు. అయితే, వారు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన భద్రత, సంక్షేమం, కార్మిక చట్టాలకు సంబంధించిన అన్ని నిబంధనలను పాటించాలి.
కొత్త నిబంధనల ప్రకారం:
- నిర్బంధం లేదు: ఏ మహిళా ఉద్యోగిని నైట్ షిఫ్ట్‌లలో మాత్రమే పనిచేయాలని ఒత్తిడి చేయకూడదు. నైట్ షిఫ్ట్‌లు వేయడానికి మహిళా ఉద్యోగుల ముందస్తు అనుమతి (Prior Consent) తప్పనిసరి.
- పని వేళలు: ఏ ఉద్యోగీ రోజుకు 9 గంటలు లేదా వారానికి 48 గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదు.
- భద్రతా ఏర్పాట్లు: యజమానులు రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులకు సురక్షితమైన రవాణా, తగిన భద్రతా ఏర్పాట్లు కల్పించాలి. సీసీటీవీ కవరేజీ ఉండాలి. సీసీటీవీ ఫుటేజీని కనీసం ఒక నెల పాటు భద్రపరచాలి.
- ఓవర్‌టైమ్: ఓవర్‌టైమ్ పనిచేసే ఉద్యోగులకు సాధారణ వేతనానికి రెట్టింపు చెల్లించాలి.
అంతేకాకుండా, ప్రతి సంస్థ తప్పనిసరిగా లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2013 ప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ని ఏర్పాటు చేయాలి. ఈ నిర్ణయం ఢిల్లీ మహిళలకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలను అందించనుంది.


