HomeTop StoriesWomen Reservation Bill: వీగిన 'మహిళా బిల్లు'.. ఇదొక 'సువర్ణ అధ్యాయం' అంటూ ప్రతిపక్షాల కామెంట్స్‌

Women Reservation Bill: వీగిన ‘మహిళా బిల్లు’.. ఇదొక ‘సువర్ణ అధ్యాయం’ అంటూ ప్రతిపక్షాల కామెంట్స్‌

Women Reservation Bill Defeated: విపక్షాల అభ్యంతరాల నడుమ ఈ రోజు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లుపై ఈ రోజు ఓటింగ్‌ జరగ్గా.. మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో అది వీగిపోయింది. ఫలితంగా డీలిమిటేషన్‌ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును సైతం కేంద్రం వెనక్కి తీసుకుంది. అయితే నారీ శక్తి వందన్‌ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టవద్దని కోరుతూ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు.. తాజా పరిణామాలతో ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నాయకులు దీనిపై తీవ్రంగా స్పందించారు. 

- Advertisement -

ఇది మహిళా బిల్లు కాదు..- రాహుల్‌ గాంధీ

ఈ బిల్లు వీగిపోవడంపై స్పందించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ.. రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టామన్నారు. ఇది ముమ్మాటికి మహిళా బిల్లు కాదని.. 2023 మహిళా రిజర్వేషన్‌ బిల్లును తీసుకువస్తే అప్పుడు మద్దతిస్తామని చెప్పారు. డీలిమిటేషన్‌తో ఈ బిల్లుకి ముడిపెట్టవద్దని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంపై జరిగిన దాడి అని, దానిని తాము అడ్డుకున్నామని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ పేరిట దేశ రాజకీయ నిర్మాణాన్ని మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. 

Also Read: https://teluguprabha.net/national-news/womens-reservation-bill-defeated-in-lok-sabha/

పాత జనాభా లెక్కలతో బిల్లు ఆమోదయోగ్యం కాదని ఎంపీ ప్రియాంక గాంధీ వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ అనేది హక్కు అని, అయితే దీనిని జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం ప్రభుత్వ దురుద్దేశానికి నిదర్శనమని విమర్శించారు.

ప్రతిపక్షాల ఐక్యత ఈ లోపభూయిష్టమైన సవరణను ఓడించిందని, ఇది ఒక చారిత్రక రోజని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో కలపడం ముమ్మాటికీ అన్యాయమని ఎంపీ కె.సి. వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదొక సువర్ణ అధ్యాయం- రేవంత్‌ రెడ్డి

మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోవడాన్ని రాజ్యాంగ పరిరక్షణలో ఒక “సువర్ణ అధ్యాయం” గా సీఎం రేవంత్‌ రెడ్డి అభివర్ణించారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.

Also Read: https://teluguprabha.net/national-news/amit-shah-addresses-the-lok-sabha-on-the-womens-reservation-bill/

అందుకే ఓడిపోయింది- కేటీఆర్‌

డీలిమిటేషన్ అంశాన్ని ముడి పెట్టడంతోనే మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలమేనని వెల్లడించారు. బీజేపీ రాజకీయంతోనే బిల్లు వీగిపోయిందని.. ఇప్పటికైనా డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాలని సూచించారు. 

ప్రతిపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తాయని బీజేపీకి తెలుసని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. తమకు సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ హడావుడిగా బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శించారు. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మహిళ నాయకత్వం వహిస్తున్న పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ ఓటమి ప్రారంభించాలని స్పష్టం చేశారు. 

ఓడిపోయింది మహిళా బిల్లు కాదు- షర్మిల

వీగిపోయింది డీలిమిటేషన్ బిల్లేనని, మహిళా బిల్లు కాదని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆన్నారు. విపక్షాలు మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 2023లో ఆమోదం పొందిన బిల్లును వెంటనే అమలు చేయాలని.. 543 లోక్‌సభ స్థానాల్లో 33 శాతం కోటా వర్తింపజేయాలని సూచించారు. 

కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై తమిళనాడు సీఎం స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ ఓడింది.. తమిళనాడు గెలిచింది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. బిల్లు ప్రతులను తగలబెడుతున్న ఫొటోను షేర్ చేస్తూ.. ఢిల్లీ అహంకారాన్ని ఓడిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News