Work from home for Maruti Suzuki employees: పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన చమురు సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, కార్పొరేట్ సంస్థలు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఆ దిశగా మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ ఫీల్డ్‌లో పనిచేయాల్సిన అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించింది. వ్యాపార అవసరాలకు మాత్రమే విదేశీ పర్యటనలను పరిమితం చేయాలని నిర్ణయించింది. దేశీయంగా కూడా ప్రయాణాలను తగ్గించుకోవాలని, ఆన్‌లైన్ సమావేశాలకే ప్రాధాన్యతనివ్వాలని సిబ్బందికి సూచించింది. ఈ మేరకు మారుతీ సుజుకీ ఎక్స్ వేదికగా పొదుపు చర్యలను ప్రకటించింది.
Also read: DGP CV Anand: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. పోలీసుల ఎదుట లొంగిపోయిన నరహరి
ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకే..
‘‘ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు మేము సైతం ముందుకొస్తున్నాం. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ప్రకటించాం. తమ ఉద్యోగుల విదేశీ పర్యటనలపై ఆంక్షలు విధించాం. ఈ సంక్షోభ పరిస్థితి నుంచి గట్టేక్కేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పొదుపు మంత్రంలో భాగస్వామ్యం అవుతున్నాం.’’ అని మారుతీ సుజుకీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది.

