కోవిడ్.. 2019 లో చైనాలో బయటపడిన ఈ రక్కసి.. ప్రపంచదేశాలన్నింటినీ కుదిపేసింది. ఆర్థిక వ్యవస్థ, జీవన శైలి పై దెబ్బకొట్టడమే కాదు.. లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. లాక్ డౌన్ పేరుతో ప్రజలు చాలా కాలం ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అలాంటి దారుణమైన పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. చైనాలో ఇంకా కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ఆ దేశ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలు, ఆంక్షల పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జెంగ్‌జూ ప్రాంతంలో యాపిల్ ఐఫోన్ల తయారీ కేంద్రం ఫాక్స్‌కాన్ ప్లాంట్ ఉంది. ఇటీవల కాలంలో అక్కడ కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో.. స్థానిక పాలకులు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో యాపిల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులు బయటికి వెళ్లకుండా చర్యలు తీసుకుంది.
ఈ ఆంక్షల కారణంగా.. ఉద్యోగులంతా తమ కుటుంబాలకు దూరమయ్యారు. వారిని చూసి చాలా రోజులవుతుంది. ఎలా ఉన్నారో తెలియదు. కంపెనీ ఆంక్షలతో విసుగెత్తిన ఉద్యోగులు బుధవారం ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురైన వందలాది ఉద్యోగులు ఒక్కసారిగా తమ విధులను బహిష్కరించారు. అనంతరం బయటకొచ్చి నిరసనకు దిగారు. ఫ్యాక్టరీలో సరైన వసతులు కల్పించడం లేదని, జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ తో ఉన్న చాలామంది తమ మధ్యే ఉన్నారని.. వేర్వేరు గదులు కూడా కేటాయించడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. తమను వెంటనే ఇళ్లకు పంపించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల నిరసనలను అడ్డుకునేందుకు సెక్యూరిటీ గార్డులు ప్రయత్నించడంతో.. ఘర్షణలు మొదలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తమవడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. సెక్యూరిటీ-ఉద్యోగుల మధ్య జరిగిన ఘర్షణల్లో చాలామంది గాయపడినట్లు తెలుస్తోంది. తమ ఉద్యోగుల నిరసనపై యాపిల్ ప్లాంట్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.