World Mental Health Day Medicos Special Story: మనం చేసే ఏ పనైనా సవ్యంగా జరగాలి అన్నా.. దానిపై ఏకాగ్రత చాలా అవసరం. ఏకాగ్రత ఉండాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. పనిలో ఒత్తిడి, నిద్ర, తిండి వేళల్లో మార్పులు.. ఇవన్నీ మెంటల్ హెల్త్‌పై ప్రభావం చూపిస్తాయి. అయితే ఏ సమయంలో ఏ ఎమర్జెన్సీ ఉంటుందో తెలియదు. గాఢ నిద్రలో ఉన్నా అత్యవసరం అని ఫోన్ వస్తే వెంటనే మైండ్‌ని యాక్టివ్ చేసుకోవాలి. ఇదంతా ఎవరి గురించి అంటే.. దేవుడిలా ప్రాణాలు కాపాడే డాక్టర్ గురించి. ఆ డాక్టర్ వృత్తి కోసం ఎంతో నిబద్ధతగా కష్టపడే వైద్య విద్యార్థుల గురించి. ఈ రోజు ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా వైద్య విద్యార్థులపై ‘తెలుగుప్రభ’ స్పెషల్ స్టోరీ..
మనిషి ప్రాణాలు కాపాడే వైద్య వృత్తి అంటే గౌరవించని వ్యక్తి ఉండరు. ఎంతో కఠోర శ్రమ అనంతరం వైట్ కోట్ ధరించి స్టెతస్కోప్‌తో ఆస్పత్రిలో అడుగుపెట్టే డాక్టర్.. సాక్షాత్తు దేవుడితో సమానం. అయితే ఆ వృత్తిలోకి అడుగుపెట్టేముందు ఓ విద్యార్థిగా వాళ్లు ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. వయసుతో పాటు వచ్చే హార్మోన్ల ప్రభావం వారిపై ఎంత ఉంటుంది. వాటన్నిటినీ దాటుకుని రోగి నాడి పట్టుకోవడానికి వాళ్లు పడే పాట్లు ఎన్నో.. ఈ కథనంలో..
ఎంబీబీఎస్‌లో చేరాలంటే ముందుగా నీట్ రాయాలి. అందులో మంచి ర్యాంకు రావాలి. అప్పుడే మంచి కాలేజీలో సీటు పొందవచ్చు. సీటు వచ్చిన తర్వాత కూడా అప్పటివరకు తెలియని కొత్త సబ్జెక్టులు.. పుస్తకాలతో రేయింబవళ్లు కుస్తీ చేయాలి. వీటన్నింటికీ తోడు అసలు వైద్య విద్య అంటేనే ఎంబీబీఎస్, హౌస్ సర్జన్సీ, పీజీ, స్పెషలైజేషన్ ఇవన్నీ చేస్తే కానీ జీవితంలో స్థిరపడలేరు. దీనంతటికీ కొన్నేళ్ల సమయం పడుతుంది. దానికితోడు వయసు ప్రభావంతో మొదలయ్యే ప్రేమ కెరీర్‌కు అడ్డంకిగా మారే అవకాశమూ ఉంది. ఇవన్నీ కూడా వైద్య విద్యార్థుల‌్లో తీవ్రమైన ఒత్తిడి(యాంగ్జైటీ), కుంగుబాటు (డిప్రెషన్)లకు కారణం అవుతున్నాయి. అయితే వీటన్నింటి నుంచి వారిని బయటకు తీసుకురావడంలో స్నేహితులు, తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని జాతీయ స్థాయి మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
సొసైటీలో డాక్టర్ అనగానే మంచి గుర్తింపు, గౌరవం ఉంటాయి. దీంతో మంచి డాక్టర్ అనిపించుకోవాలనే ఒత్తిడి వైద్యుల మీద పడుతుంది. చాలామంది వాళ్లకేముంది, డాక్టర్లే కదా.. ఏ సమస్య వచ్చినా వాళ్లకే తెలిసిపోతుందని భావిస్తారు. కానీ అది తప్పు. ఎలాంటివారికైనా తాము ఎదుర్కొనే మానసిక సమస్యల గురించి తెలియకపోవచ్చు. ఇలాంటివాటిని పక్కవారే కొంతవరకు గుర్తించగలరు. కాబోయే వైద్యుల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉండటం సహజం కాబట్టి, వాటిని తోటివారు గుర్తించి దాన్నుంచి వారిని బయటకు తీసుకురావడానికి సహాయం చేయాలి.
లక్షల్లో పోటీ
మొత్తం వైద్యవిద్యార్థులను పరీక్షిస్తే వారిలో 30-40% మందికి మానసికపరమైన సమస్యలు ఉంటున్నాయని జాతీయ మానసిక సర్వేలలో వెల్లడైంది. అంతేకాదు, 8% మంది విద్యార్థులు అసలు వైద్యవిద్యలో చేరేందుకు ముందే మానసిక వైద్య నిపుణులను సంప్రదిస్తున్నారట. 2% మందికి మూడ్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్, అడ్జస్ట్‌మెంట్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ), అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ లాంటివి ఉన్నట్లు స్పష్టమైంది. నీట్ పరీక్షకు దాదాపు 20 లక్షల మంది వరకు పోటీ పడుతుండగా, దేశంలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1.25 లక్షలు మాత్రమే. అందువల్ల ఇంత పోటీని తట్టుకోలేక చాలామంది మానసికంగా తీవ్ర కుంగుబాటుకు గురవుతున్నారు.
నో చెప్పాలన్నా భయమే
నీట్‌లో అంతటి పోటీని ఎదుర్కొని ఎంబీబీఎస్‌లో ప్రవేశించినవారిలో కూడా అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఆ వయసులో ఉండే ప్రభావం, ప్రేమలు, వాటిలో ఎదురయ్యే వైఫల్యాలు కూడా వారిని కుంగుబాటుకు గురయ్యేలా చేస్తున్నాయి. ఎవరైనా నో అని చెబుతారేమోనన్న భయం కూడా వారిని వెంటాడుతుంది. అలాగే ఎవరికైనా నో అని చెప్పాలన్నా కూడా వారు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఏ విషయంలోనైనా విఫలం అవుతామేమో అన్న భయంతో అసలు ప్రయత్నించడానికే వెనకడుగు వేస్తున్నారు. ఇవన్నీ కూడా వారిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి.
ఒక్క వైద్య విద్యార్థులనే కాదు.. ఉన్నతస్థాయి విద్యాసంస్థల్లో చదివే న్యాయ విద్యార్థులు, ఇతరులకూ ఇదే తరహా సమస్య ఉంటోంది. వీటన్నింటికీ తోడు ఇంటి దగ్గర వాతావరణం కూడా వారిని ప్రభావితం చేస్తుంది. ఇంట్లో ఎవరికైనా ఇంతకుముందు మానసిక సమస్యలుంటే పిల్లలకు క్లినికల్ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరం.. ఇలాంటి శారీరక సమస్యలైతే పైకి కనిపిస్తాయి కాబట్టి వెంటనే చికిత్స చేయించుకుంటారు. కానీ మానసిక సమస్యలు అలా కాదు. పైకి కనపడవు. దానివల్ల చాలామంది వెంటనే చికిత్సకు, కౌన్సెలింగ్‌కు అస్సలు వెళ్లరు. దీంతో సమస్య మరింత ఎక్కువ అవుతోంది.
ఎంబీబీఎస్‌లో చేరినప్పుడు మొదటి రెండు మూడేళ్ల పాటు మార్కులు, ప్రేమలు.. ఇలాంటి ఒత్తిడి ఉంటుంది. ఇక చివరి రెండేళ్లకు వచ్చేసరికి కెరీర్‌లో తాము ఎలా స్థిరపడతామో అన్నభయం మొదలవుతుంది. ఎందుకంటే, ఒక్క ఎంబీబీఎస్ చదివితే సరిపోదు. తర్వాత ఇంటర్న్‌షిప్ చేయాలి, ఆపై స్పెషలైజేషన్, పీజీ ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటికీ చాలా ఎక్కువ కాలం పడుతుంది. ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంత చేస్తే తప్ప సమాజంలో మంచి డాక్టర్ అనిపించుకోలేరు. ఇదంతా కూడా వారి మీద ఒత్తిడి కలగజేస్తుంది. ఇలాంటి పరిస్థితి నుంచి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ మెడికో పిల్లలతో బాగా మాట్లాడాలి. వాళ్లకు ఏమైనా సమస్యలున్నాయా, ఒత్తిడి ఉంటోందా అన్న విషయాన్ని నేరుగా ప్రశ్నించకుండా మాటల్లో పెట్టి తెలుసుకోవాలి. వారికి ఊరట కల్పించేలా మాటలు చెప్పాలి. అప్పుడే వాళ్లు ఈ ఒత్తిడి నుంచి కొంతయినా బయట పడగలరు.
మార్కుల ఒత్తిడి ఎక్కువే
పిల్లలు పదో తరగతి, ఇంటర్మీడియట్‌లలో చాలా ఎక్కువ మార్కులు అంటే 96%, 98% తెచ్చుకుంటారు. కానీ నీట్ ర్యాంకు సంపాదించడం, ఎంబీబీఎస్ సీటు సాధించడం కూడా అంత సులభం కాదు. ఈ ఒత్తిడిని అధిగమించడమే కష్టం అవుతుంది. తర్వాత ఎలాగోలా ఎంబీబీఎస్‌లో చేరినా అక్కడ అప్పటివరకు తెలియని కొత్త సబ్జెక్టులు వస్తాయి. అవి చదవాలంటే చాలా ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఇదంతా కూడా వారి మీద తెలియని ఒత్తిడి కలగజేస్తుంది. దీనంతటికీ తోడు.. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసేసరికి ఆ ఫలితాల్లో పదోతరగతి, ఇంటర్‌లో వచ్చినంత స్థాయిలో మార్కులు రావు. ఇది కూడా వారిని తీవ్రమైన కుంగుబాటుకు గురిచేస్తోంది. ఇలాంటి సమయంలో స్నేహితులు, తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మార్కులు రాలేదని ఇంట్లో తిట్టే కంటే.. పెద్ద చదువులకు వెళ్లేకొద్దీ ఎలా ఉంటుందన్నది వారికి వివరించి, నచ్చజెప్పడం ముఖ్యం. అలా చర్చించే వాతావరణం ఇంట్లో లేకపోతే పిల్లలు చాలా త్వరగా మానసిక సమస్యల పాలవుతారు.
ఇటీవలి కాలంలో తరచుగా వైద్య విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు చూస్తున్నాం. అయితే అందుకు కారణం కేవలం ఒత్తిడి, కుంగుబాటు మాత్రమే కాదు. అసలు ఆత్మహత్య వరకు వెళ్లే పరిస్థితి వచ్చిందంటే అందుకు అనేక కారణాలు ఉండి ఉండాలి. ఆ సమస్యలన్నింటికీ ఇక పరిష్కార మార్గం కనిపించకపోవడం, ఇక మరణం మాత్రమే వాటన్నింటినీ పరిష్కరిస్తుందని వారు భావించడం వల్లనే అలా చేస్తారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నవారిని గుర్తించడం కూడా చాలా కష్టం. కొద్దిమంది మాత్రమే అప్పుడప్పుడు మాటల్లో బయటపడతారు తప్ప, మిగిలినవాళ్లు అసలు ఏమీ దాని గురించి మాట్లాడరు. ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు చాలావరకు ముభావంగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని తల్లిదండ్రులు, తోటి స్నేహితులు గుర్తించగలగాలి. తరచు పరాగ్గా ఉండడం, ఏమీ సరిగ్గా తినకపోవడం, ఎవరితోనూ మాట్లాడకపోవడం లాంటివి ఉన్నాయంటే అవి ఏదో మానసిక సమస్యకు లక్షణాలని గుర్తించాలి. వారి సమస్యలు ఏంటో తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయకపోతే.. చివరకు అవి ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయి.
కాబోయే వైద్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన సమాజం మీదే ఉంటుంది. అంత కష్టపడి నీట్ ర్యాంకు సాధించి, ఎంబీబీఎస్ సీటు సంపాదించిన తర్వాత ఇలాంటి మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా వారు వెనకడుగు వేసే పరిస్థితి ఉండకూడదు. దాన్నుంచి వారిని బయటకు తీసుకొచ్చి, దేశానికి మంచి వైద్యులను అందించాలి. అందుకు తల్లిదండ్రులతో పాటు స్నేహితులు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాలి. అప్పుడే మన దేశానికి తగినంతమంది మంచి వైద్యులు దొరుకుతారు.


