Yakshaganam : ఇటీవల కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరగుతోంది. అప్పటి వరకు అందరితో ఎంతో సరదా ఉండి స్టేజీపై ప్రేక్షకులను అలరిస్తున్న ఓ కళాకారుడు ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
మంగళూరులోని కటీల్ దుర్గా పరమేశ్వరీ యక్షగాన మండలంలో గురువారం త్రిజన్మ మోక్ష యక్షగానం జరిగింది. 58 ఏళ్ల గురువప్ప బయ్యరు యక్షగాన పాత్రధారి శిశుపాల పాత్ర పోషించాడు. స్టేజీపై నాటకం కొనసాగుతుండగా ఒక్కసారిగా గురువప్ప పై నుంచి కిందపడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వారు మంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు కారణంగా అతడు చనిపోయినట్లు చెప్పారు.
ఆరోగ్యవంతమైన యువకులు, మధ్య వయస్సులైన భారతీయుల్లో ఇటీవల గుండెపోటు బారిన పడుతున్న వారి సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ఓ సర్వే ప్రకారం 51 శాతం మంది వ్యక్తులు తమ సన్నిహితుల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది గత రెండేళ్ల కాలంలో గుండెపోటు లేదా, రక్తం గడ్డకట్టడం, నరాల సంబంధిత సమస్యలు, క్యాన్సర్ లేదా ఇతర ఆకస్మిక వైద్య పరిస్థితులను ఎదుర్కొన్నారు.