Yogi Adityanath Flags “Political Islam”: ‘పొలిటికల్ ఇస్లాం’ (Political Islam) భారతదేశ జనాభాను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ఒక పెద్ద ముప్పు అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఈ ముప్పుపై మన పూర్వీకులు పోరాటం చేసినా, ఇప్పుడు ఈ అంశం గురించి చర్చ జరగడం లేదని అన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గోరఖ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో యోగి ప్రసంగించారు. చరిత్రలో బ్రిటీష్, ఫ్రెంచ్ వలసవాదం గురించి చర్చ జరుగుతుంది కానీ, ‘పొలిటికల్ ఇస్లాం’ గురించి పెద్దగా ప్రస్తావన లేదని ఆయన అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, గురు గోవింద్ సింగ్, మహారాణా ప్రతాప్ వంటివారు ఈ ‘పొలిటికల్ ఇస్లాం’కు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు.
‘పొలిటికల్ ఇస్లాం’ ఇప్పటికీ భారతదేశాన్ని విడగొట్టడానికి పనిచేస్తోందని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బలరాంపూర్ జిల్లాలోని ఛంగూర్ బాబా కేసును ఉదహరించారు. ఛంగూర్ బాబా అలియాస్ జలాలద్దీన్ షా అనే మత గురువు అక్రమ మతమార్పిడి రాకెట్‌ను నడుపుతూ జూలైలో అరెస్టు అయ్యాడు. ఛంగూర్ బాబా వంటి వ్యక్తుల ద్వారా ‘పొలిటికల్ ఇస్లాం’ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని యోగి ఆరోపించారు.
హలాల్ సర్టిఫికేషన్‌పై తీవ్ర హెచ్చరిక
మత మార్పిడి చేసుకునేవారికి ఛంగూర్ బాబా కులాన్ని బట్టి డబ్బు ఇచ్చేవాడని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదని యోగి అన్నారు. “ఆ డబ్బు మరే దేశం నుంచో రావడం లేదు, మీ నుంచే వస్తోంది” అని ఆయన హెచ్చరించారు.
“మీరు ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు, దానిపై హలాల్ (Halal) సర్టిఫికేషన్ ఉందో లేదో తప్పకుండా తనిఖీ చేయండి. మేము దానిని ఉత్తరప్రదేశ్‌లో నిషేధించాం. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, సబ్బు, బట్టలు, అగ్గిపెట్టెలకు కూడా హలాల్ సర్టిఫికేషన్ ఇస్తున్నారు” అని ముఖ్యమంత్రి తెలిపారు.
హలాల్ సర్టిఫికేషన్ పేరుతో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా దేశంలో రూ. 25,000 కోట్ల భారీ మొత్తం సేకరించబడుతోందని ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఈ డబ్బును ఉగ్రవాదం, లవ్ జిహాద్, మత మార్పిడుల కోసం దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దానిపై పెద్ద ఎత్తున చర్యలు మొదలుపెట్టిందని ఆయన వివరించారు. ఛంగూర్ వంటి ‘జలాలద్దీన్‌లు’ మీ చుట్టూ దాగి ఉండవచ్చు, వారిపై నిఘా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అఖిలేష్ యాదవ్‌పై విమర్శలు
దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దీపోత్సవ్‌పై విమర్శలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై యోగి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “దీపాలు వెలిగించాల్సిన అవసరం ఏముంది అని అడిగారు. అంటే దీపావళి అంటేనే అతనికి ద్వేషం. సింహాసనాన్ని వారసత్వంగా పొందవచ్చు, కానీ మెదడును పొందలేరు. అందుకే కొంతమందికి జీవితాంతం చిన్నపిల్లల మనస్తత్వమే ఉంటుంది” అని యోగి, అఖిలేష్‌ను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు.


