Congress Targets PM Modi On Manipur Visit: మణిపూర్‌లో గత రెండేళ్లుగా జరుగుతున్న జాతి ఘర్షణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఎట్టకేలకు ఈ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మణిపూర్‌లో పర్యటించారు. అయితే, ఈ పర్యటనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ పర్యటనను “కేవలం ఒక డ్రామా, కంటి తుడుపు చర్య” అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు.
ALSO READ: Narendra Modi: కన్నీటి గాయాలకు ప్రధాని ఓదార్పు.. మణిపూర్‌కు శాంతి మంత్రం, అభివృద్ధి యజ్ఞం!
ఖర్గే తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ప్రధాని మోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు. “మణిపూర్‌లో హింస చెలరేగిన మే 2023 నుంచి మీరు 46 విదేశీ పర్యటనలు చేశారు. మరి, మన దేశంలోనే ఉన్న మణిపూర్ ప్రజలను పరామర్శించేందుకు మీకు సమయం దొరకలేదా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మోదీ మూడు గంటల పర్యటన మణిపూర్ ప్రజలకు “తీవ్ర అవమానం” అని, ఇది కేవలం మీడియా ఫోకస్ కోసం చేస్తున్న ప్రయత్నమని ఖర్గే ఆరోపించారు.
మణిపూర్ హింసలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 67,000 మంది నిరాశ్రయులయ్యారని, 1,500 మందికి పైగా గాయపడ్డారని ఆయన గుర్తు చేశారు. “మీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం” మణిపూర్‌లో అమాయక ప్రజల జీవితాలను నాశనం చేసిందని, హింస ఇంకా కొనసాగుతున్నప్పటికీ కేంద్రం మౌనంగా ఉందని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ: Dubai Asia Cup: రక్తం క్రికెట్ కలిసి ప్రవహించలేవ్.. ఇండియా పాక్ మ్యాచ్‌పై ఉద్ధవ్ థాక్రే సీరియస్
ఈ పర్యటన కేవలం ఒక పిట్ స్టాప్ మాత్రమేనని, ఇది ప్రధాని రాజధర్మం కాదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ప్రధాని ఇంతకు ముందే మణిపూర్‌కు వచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోదీ ఈ పర్యటనలో చురాచంద్‌పూర్, ఇంఫాల్‌లలో నిరాశ్రయులైన ప్రజలను కలుసుకోనున్నారు. అలాగే, రూ. 8,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అయితే, ఈ పర్యటన మణిపూర్ ప్రజల గుండెల్లో ఉన్న గాయాలను ఎంతవరకు మాన్పగలుగుతుందో వేచి చూడాలి.
ALSO READ: Yogi Adityanath: చిన్న విషయాలే అని లైట్ తీసుకోవద్దు- నేపాల్ సంక్షోభంపై యోగి కామెంట్స్


