ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా వాట్సాప్ ద్వారా ప్రజలకు త్వరలోనే జనన, మరణ ధృవీకరణ పత్రాలు పొందే సదపాయం కూడా కల్పిస్తున్నామన్నారు.
ఎలాంటి ఇబ్బందులు రాకుండా
దీనికి సంబంధించిన కసరత్తులో భాగంగా ఈ నెలలోనే తెనాలిలో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను పరిశీలించనున్నట్లు వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు జనన, మరణ ధృవీకరణ పత్రాలు పొందే సేవలు కల్పించే ప్రక్రియపైన సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు పౌరులకు మరింత సులభతరం చేయాలనే సదాశయంతో ముఖ్యమంత్రి వాట్సాప్ గవర్నెన్స్ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆర్టీజీఎస్ అధికారులను సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా జనన మరణ ధృవీకరణ పత్రాల సేవలు కల్పించడమనేది కీలకమైందని, దీనికి సంబంధించిన పనులు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సేవలను పగడ్బందీగా ప్రజలకు అందిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెనాలీలో ముందుగా దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాలని సూచించారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు, సాంకేతికంగా ఎదురయ్యే ఇబ్బందులను సునిశితంగా పరిశీలించి అధ్యయనం చేసి తదనుగుణంగా ఈ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. దీనికి కావాల్సిన అన్ని విధాల సహకారాన్ని పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, పురపాలక శాఖలు ఆర్టీజీఎస్ అధికారులకు అందించాలని సూచించారు.
సిద్ధం చేసిన ఆర్టీజీఎస్ఆర్టీజీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్‌ను అమలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆర్టీజీఎస్ సిద్ధం చేసిందన్నారు. జనన మరణ ధృవీకరణ పత్రాలు వాట్సాప్ ద్వారా జారీ చేసే ప్రక్రియ కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలకు తావివ్వకుండా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెలలోనే తెనాలీ మండలంలోని మొత్తం పంచాయతీల్లో, తెనాలి పురపాలక సంఘంలో వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించిన సాంకేతిక ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరిశీలించి చూస్తామన్నారు. వాట్సాప్ ద్వారా ఈ సర్టిఫికెట్ల జారీ కొరకు ఆర్టీజీఎస్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పేరిట ఒక పోర్టల్‌ను రూపొందించామన్నారు. ఇందులో జనన మరణ నమోదు డేటా మొత్తం అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. డాటా లేక్ ఏర్పాటు పనులు కూడా చురుగ్గా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒకసారి జనన, మరణ ధృవీకరణ పత్రం జనరేట్ అయితే ఆ వెంటనే సంబంధిత పౌరుల వాట్సాప్‌కు సందేశం పంపండంతో పాటు, ఆ వెంటనే వాట్సాప్ ద్వారానే ఈ పత్రాలు డౌనులోడు చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పారు.
ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పురపాలక శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ. సూర్యకుమారి, పంచాయతీరాజ్ శాఖ సంచాలకులు కృష్ణ తేజ, గ్రామవార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.