Friday, November 22, 2024
HomeNewsTelangana to rise electricity charges soon: మరో 3 రోజుల్లో తెలంగాణలో పెరగనున్న...

Telangana to rise electricity charges soon: మరో 3 రోజుల్లో తెలంగాణలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు!

మరో 3 రోజుల్లో..

ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కరెంటు ఛార్జీలు ఎంతమేర ఉన్నాయనే వివరాలతో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ ఈఆర్‌సీ)కు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇటీవలే ఒక నివేదికను సమర్పించాయి. ఇందులో విద్యుత్ ఛార్జీల పెంపుపై పలు కీలక ప్రతిపాదనలను డిస్కంలు చేసినట్లు తెలుస్తోంది. వీటిపై ఈఆర్‌సీ పాలకవర్గం చర్చించి, ఛార్జీల పెంపుపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్ల కరెంటు వాడితే స్థిరఛార్జీని రూ.10 నుంచి రూ.50 పెంచాలని తెలిపాయి. హైటెన్షన్‌ వినియోగదారులకు 11కేవీ కనెక్షన్‌ స్థాయిలోనే 33కేవీ, 132 కేవీ కనెక్షన్లకు విద్యుత్‌ ఛార్జీలను పెంచి వసూలు చేస్తామన్నాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్‌సీ విచారణ కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయనే వివరాలతో డిస్కంలు ఈఆర్‌సీకి తాజాగా నివేదికను అందజేసాయి. కాగా , ఈఆర్‌సీ ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఈ నెల 29తో ముగియనున్న నేపథ్యంలో మరో 2, 3 రోజుల్లో ఛార్జీల పెంపుపై తుది తీర్పు ఇవ్వనుందని సమాచారం.

- Advertisement -

ఇళ్లలో 300 యూనిట్లు దాటితే నెలకు 300 యూనిట్లకు పైగా వస్తున్న ఇళ్ల కరెంటు కనెక్షన్‌కు స్థిరఛార్జీని మహారాష్ట్రలో నెలకు రూ.148, కర్ణాటకలో రూ.120, ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ.53, గుజరాత్‌లో రూ.45 చొప్పున వసూలు చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించిన రూ.10 స్థిరఛార్జీనే ఏపీ, తెలంగాణలో ఇప్పటికీ కొనసాగుతోందని వివరించారు. లోటెన్షన్‌ వాణిజ్య కేటగిరీ కనెక్షన్లకు తెలంగాణలో నెలకు ప్రస్తుతం రూ.70 వసూలు చేస్తుండగా రూ.150కి పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఇదే కేటగిరీకి మహారాష్ట్రలో రూ.626, యూపీలో రూ.355, కర్ణాటకలో రూ.255, తమిళనాడులో రూ.107 చార్జీలు వసూలు చేస్తున్నట్లు డిస్కంలు తెలిపాయి.
తెలంగాణలో నెలకు 300 యూనిట్లు దాటే ఇళ్లకు స్థిరఛార్జీలను పెంచితే అదనంగా రూ.328 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కంలు ఈఆర్‌సీకి వివరించాయి. పరిశ్రమలకు కరెంటు ఛార్జీల పెంచితే వాటిపై ఆర్థికభారం పడుతుందని ప్రతిపక్షాలు ఈఆర్‌సీకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో హెచ్‌టీ కేటగిరీకి వసూలు చేస్తున్న ఛార్జీల వివరాలను డిస్కంలు ఈఆర్‌సీకి నివేదించాయి.

ప్రస్తుతం తెలంగాణలో హెచ్‌టీ పరిశ్రమల కనెక్షన్లకు 11కేవీకి యూనిట్‌కు రూ.7.65, 33కేవీకి రూ.7.15, 132కేవీకి రూ.6.65 చొప్పున డిస్కంలు వసూలు చేస్తున్నాయి.ఇకపై ఈ మూడు ఈ కేటగిరీలకు యూనిట్‌కు రూ.7.65 చొప్పున వసూలు చేస్తామని తెలిపాయి. కానీ ప్రస్తుతం మహారాష్ట్రలో యూనిట్‌కు రూ.8.36, కర్ణాటకలో రూ.7.40, గుజరాత్‌లో రూ.6.90, తమిళనాడులో రూ.6.90 చొప్పున హెచ్‌టీ పరిశ్రమల నుంచి వసూలు చేస్తున్నారు. హెచ్‌టీ వాణిజ్య కనెక్షన్‌కు మన రాష్ట్రంలో యూనిట్‌కు రూ.8.80 వసూలు చేస్తుండగా మహారాష్ట్రలో రూ.13.21, కర్ణాటకలో రూ.9.25, తమిళనాడులో రూ.8.70గా ఉన్నట్లు డిస్కంలు వివరించాయి. ఇదే కేటగిరీలో స్థిరఛార్జీని రూ.475 నుంచి రూ.500కి పెంచాలని ప్రతిపాదించామని, కానీ ఇప్పటికే మహారాష్ట్రలో రూ.664, తమిళనాడులో రూ.590, గుజరాత్‌లో రూ.570 వసూలు చేస్తున్నట్లు డిస్కంలు స్పష్టం చేశాయి. హెచ్‌టీ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్‌సీ ఆమోదిస్తే రూ.700 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News