మరి కొద్ది రోజుల్లో 10వ తరగతి పరీక్షలు రాయాల్సిన బాలిక (Minor girl)ను ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి గర్భం దాల్చేలా చేశాడు. తీవ్ర రక్త హీనతతో ఇబ్బంది పడిన సదరు బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయ స్థితిలో సిజేరియన్ చేసి బిడ్డను బయటకి తీశారు వైద్యులు. అయితే బిడ్డకు జన్మనిచ్చిన బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ అమానుష ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం, టి. ఒడ్డురూ గ్రామంలో పదవ తరగతి చదువుకుంటున్న ఓ బాలిక పాఠశాలకు సెలవు వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చేంది. ఆ బాలికను ఓ మహిళ ఆవుల మేతకు తీసుకెళ్లి ఓ కామాందుడి చేతిలో పెట్టేదని తెలిసింది. వాడు పలుమార్లు లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు.
బాలిక కడుపు పెరగటంతో
టీ.ఒడ్డూరు గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక పెంగరగుంటలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. రెండు నెలల కిందట బాలిక కడుపు పెరగడాన్ని గమనించిన ఉపాధ్యాయురాలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు బాలికను బడికి పంపడం మాన్పించారు. శనివారం ఉన్నట్టుండి ఆ బాలికకు ఫిట్స్ రావడంతో తల్లిదండ్రులు బంగారుపాళ్యం ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే 6 నెలలు
ఆరు నెలల గర్భిణీ అయిన ఆ బాలిక రక్తహీనతతో బాధపడుతోందని వైద్యులు నిర్ధారించి జిల్లా ఆస్పత్రికి పంపించారు. అక్కడి వైద్యులు పరీక్షించి రక్త హీనత కారణంగా బాలిక ఊపిరితిత్తులకు ఉమ్మ నీరు చేరిందని, బిడ్డను బయటకు తీస్తే తప్ప తల్లిని బతికించలేమని తేల్చి చెప్పారు.
మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక
ఈ మేరకు కలెక్టర్, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి వారి ఆదేశాల మేరకు బాలికకు సిజేరియన్ చేశారు. మగబిడ్డను బయటకు తీశారు.
చికిత్స పొందుతూ బాలిక మృతి
తల్లి పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు తిరుపతి రుయాకు వెళ్లమని చెప్పారు. వెంటిలేటర్ మీద శనివారం రాత్రి 9.30 గంటలకు చిత్తూరు నుంచి తిరుపతికి తీసుకువచ్చారు. రూయాలో చికిత్స పొందుతూ ఆ బాలిక ఆదివారం ప్రాణాలు విడిచింది.
ఐసీయూలో బిడ్డ
బాలిక మృతితో బిడ్డను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పలమనేరు సీఐ నరసింహరాజు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు చేసి వెల్లడిస్తామన్నారు.