సాగు నీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. 1956 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు నిర్మించిన ప్రాజెక్టులు, వాటి నిర్మాణ వ్యయాలు, ప్రాజెక్టుల వారీగా సాగులోకి తెచ్చిన ఆయకట్టు వివరాలను అధికారుల ద్వారా సీఎం తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రజలకు తెలియజేసేలా చూడాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని రకాల లెక్కలు పూర్తిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దని ఒక వేళ అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వంలో ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనన్న ఉద్దేశంతో ప్రతి అంశాన్ని ప్రజలకు విడమరచి చెబుతున్నామన్నారు. ఈ విషయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి నిజాలను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, రఘునందన్ రావు, శేషాద్రి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.