Thursday, October 3, 2024
Homeఆంధ్రప్రదేశ్AP government target is 15 % growth rate: 15 శాతం గ్రోత్ రేట్...

AP government target is 15 % growth rate: 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి

తలసరి ఆదాయం తగ్గింది

ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ది సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ది పై సచివాయలంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా శాఖల అధికారులు గత 10 ఏళ్ల కాలంలో పరిస్థితులను వివరించారు. గత పభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని….దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందని సీఎం అన్నారు. నేడు ప్రతిశాఖలో కొత్త పాలసీలు తీసుకువస్తున్నామని..వీటిని సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతి సాధించాలని సీఎం అన్నారు.

- Advertisement -

ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు..ప్రజలపై అదనపు భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలను అమలు చేయాలని సీఎం అన్నారు. వ్యవసాయం రంగంలో సమగ్ర యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గించవచ్చన్నారు. ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడం మాత్రమే కాదని…ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడం ముఖ్యమని అన్నారు. 2014 తరువాత విభజన కష్టాలు ఉన్నా నాడు తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం 13.7 శాతం గ్రోత్ రేట్ సాధించిందని…అయితే తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ రివర్స్ నిర్ణయాలతో వృద్ధి రేటు 10.59 శాతానికి తగ్గిందని సీఎం అన్నారు. 2019లో తెలంగాణతో పోల్చితే ఎపి జిఎస్డిపిలో వ్యత్యాసం కేవలం 0.20 శాతం ఉండేదని….ఆ వ్యత్యాసం 2024కు 1.5 శాతానికి పెరిగిందని సిఎం అన్నారు.

2014-15 మధ్య ఎపి ప్రజల తలసరి ఆదాయం రూ.93,903 ఉండగా….నాటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తలసరి ఆదాయం 2019 నాటికి రూ.1,54,031 పెరిగిందని సిఎం అన్నారు. తెలుగుదేశం హయాంలో తలసరి ఆదాయం వృద్ధి 13.21 శాతం ఉండగా..గత ప్రభుత్వంలో అది 9.06 శాతం మాత్రమే నమోదు అయ్యింది. ప్రజల తలసరి ఆదాయంలో వృద్ధి పడిపోయి…..ప్రజల జీవన ప్రమణాలు దెబ్బతిన్నాయన్నారు. నాడు తెలంగాణకు ఎపి మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం కేవ‌లం 0.16 శాతం మాత్ర‌మే ఉంటే…గత ప్రభుత్వంలో అది 1.84 శాతానికి పెరిగిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎపి తలసరి ఆదాయంలో 5వ స్థానంలో ఉందని సిఎం అన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ శాఖలు విజన్ సిద్ధం చేసుకుని నిర్ధిష్ట లక్ష్యాలతో పనిచేయాలని సిఎం అధికారులకు సూచించారు. కొన్ని శాఖలు బాగా వెనకబడి ఉన్నాయని….వారు యాక్టివ్ కావాల్సిన అవసరం ఉందని సూచించారు. త్వరలో ఈ మూడు రంగాల్లో లక్ష్యాలపై ప్రణాళికలతో రావాలని సిఎం అధికారులను ఆదేశించారు. జనవరిలో P4 విధానాన్ని ఆచరణలోకి తెస్తున్నామన్నారు. ఈ విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు ఆర్థికంగా అట్టడుగున ఉన్న 10 శాతం మందని పైకి తెసుకువచ్చేందుకు సహాయం చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు….సంపన్నులు, సంస్థలు సిఎస్ఆర్ ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచడానికి, వారికి అవకాశాలు కల్పించడానికి మెంటార్ లా దోహద పడాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News