Saturday, April 19, 2025
HomeNewsOntimitta: ఏప్రిల్ 6 నుండి 15వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు

Ontimitta: ఏప్రిల్ 6 నుండి 15వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు

అత్యంత చారిత్రాత్మక ప్రాశస్త్యం గల ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు.

- Advertisement -

శనివారం స్థానిక టిటిడి కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవనం సమావేశపు హాలులో… టీటీడీ ఈవో జే. శ్యామల రావు, టీటీడీ జెఈఓ వీరబ్రహ్మం, డిఆర్వో విశ్వేశ్వర నాయుడులతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, టీటీడీ అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు.

ముఖ్యంగా ఏప్రిల్ 11వ తేదీన జరిగే సీతారాములవారి కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉన్నందున పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు అత్యంత ప్రముఖులు, ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఆ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా, టీటీడీ, పోలీస్ అధికారులు సంయుక్తంగా, నిర్దిష్ట ప్రణాళికలతో విధులను నిర్వర్తించాలన్నారు. రాములవారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కళ్యాణవేదిక ముందు ఏర్పాటు చేసిన ఒక్కో గ్యాలరీకి ఒకరిని ఇంఛార్జిగా నియమిస్తామన్నారు. ఎక్కడా కూడా జనం తొక్కిసలాట జరుగకుండా అధికారులు, పోలీస్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీతారాములవారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే మంత్రులు, ఇతర ప్రముఖులకు బస సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎలాంటి షార్ట్ సర్క్యూట్ కు అవకాశం లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకు ముందుగానే ఎలాంటి లోటుపాట్లు లేవని, సక్రమంగా ఉన్నాయని సర్టిఫికెట్ ను విద్యుత్తు అధికారులను ఆదేశించారు.

విజయవాడ, హైదరాబాద్, తమిళనాడు నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున బస్సుల ఏర్పాటు అలాగే ఉమ్మడి కడప జిల్లాల నుండి బస్సులను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కడప, రాజంపేట, రాయచోటి వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు సౌకర్యార్థం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనకు బస్సుల ఏర్పాటు, దర్సన సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్ ను ఆదేశించారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పబ్లిక్ అడ్రెస్ సిస్టం ద్వారా కడప, రాజంపేట, ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సుల సమాచారం, ఉచిత బస్సుల సౌకర్యం పై ఎప్పటికప్పుడు సమాచారం తెలియచేయాలన్నారు. వచ్చిన భక్తులను గమ్యం స్థానాలకు సురక్షితంగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వాహనాల పార్కింగ్ వద్ద టోయింగ్ వాహనాలను సిద్ధంగా ఉంచాలని సంభందిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక, కనీస వసతులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీరు, భక్తులకు అన్నప్రసాదాలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు ఏర్పాటు, కంట్రోల్ రూం ఏర్పాటు, సీసీ కెమెరాలు, విద్యుత్, అగ్నిమాపక వాహనాలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, 108 వాహనాలు, అత్యవసర మందులు, కార్డియాలజిస్టు, వైద్య ఆరోగ్య సిబ్బంది, తాత్కాలిక మెడికల్ క్యాంపులు, అక్కడక్కడ హెల్ప్ డెస్కులు, ఎల్ ఈ డి స్క్రీన్స్ ఏర్పాటు మొదలైన అన్ని అంశాలను ఎలాంటి కొరత లేకుండా.. ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

రాత్రి వేళలో కల్యాణోత్సవం జరుగుతుంది కనుక విద్యుత్ దీపాలంకరణ తో పాటు.. అత్యంత పటిష్ట చర్యలను కూడా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుదీకరణ, తోరణాలు, పుష్పాలంకరణ, స్వాగత ఆర్చిలు, ఎల్‌ఇడి బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు మాట్లాడుతూ ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 06 నుంచి 15వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మార్చి చివరి నాటికి ఆలయంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని, కల్యాణ వేదికను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని అధికారులను కోరారు. కడప జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లను ప్రణాళిక బద్ధంగా చేపట్టాలన్నారు. ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షిస్తానని చెప్పారు. బ్రహ్మోత్సవాలపై ప్రచార రథాల ద్వారా కడప, అన్నమయ్య జిల్లా ప్రధాన పట్టణాలతోపాటు ఒంటిమిట్ట పరిసర ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో చేయాల్సిన పనులను చెక్ లిస్ట్ ప్రకారం పూర్తి చేయాలని , భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టాలని ఇంజనీరింగ్, తదితర శాఖ అధికారులను ఆదేశించారు.

ఏప్రిల్‌ 11న శ్రీ సీతారాముల కల్యాణం : ఈవో
ఏప్రిల్‌ 11న శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించే ఈ కల్యాణానికి లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో టిటిడి అధికారులు, కడప జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

భక్తుల రద్దీ నేపథ్యంలో ఒంటిమిట్ట ఆలయం పరిసరాలు, కల్యాణ వేదిక సమీపంలో ట్రాఫిక్ , భధ్రతా, క్యూలైన్లు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిక, స్వామివారి తలంబ్రాలు పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ పటిష్ట బారికేడింగ్ ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్యాలరీ వద్ద గట్టి భద్రతా చర్యలు చేపడతామన్నారు. గతంలో నిర్వహించిన శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాల అనుభవాలను గుర్తుంచుకొని.. ఎక్కడా, ఎలాంటి చిన్న పొరపాటుకు కూడా అవకాశం లేకుండా.. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు కృషిచేస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News