Friday, November 22, 2024
HomeNewsAsian Games, China tops: శత్రువు నేర్పే పాఠాలు మనం నేర్చుకునేదెన్నడు?

Asian Games, China tops: శత్రువు నేర్పే పాఠాలు మనం నేర్చుకునేదెన్నడు?

క్రీడల్లో ఆసియాఖండంలో చైనాను ఢీకొనటం కష్టసాధ్యం

సుదీర్ఘ కాలం తర్వాత ఆసియా క్రీడల్లో భారత దేశం సగర్వంగా తలెత్తుకుంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఆసియా క్రీడల చరిత్రలోనే ఎన్నడూ లేని స్థాయిలో భారతదేశం వందకు పైగా పతకాలు తొలిసారి సాధించింది. అన్ని విభాగాలకు చెందిన క్రీడాకారుల సమష్టి కృషితో ఏకంగా 28 స్వర్ణ పతకాలు, 38 రజత పతకాలు, 41 కాంస్య పతకాలు కలిపి.. మొత్తం 107 పతకాలతో పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. గతంలో ఎప్పుడూ మన దేశానికి 28 స్వర్ణ పతకాలు ఆసియా క్రీడల్లో రాలేదు. చివరకు మనం సొంతంగా 1982లో ఢిల్లీలో నిర్వహించినప్పుడు కూడా మనం 13 స్వర్ణాలు, 19 రజతాలు, 25 కాంస్య పతకాలతో మొత్తం 57 పతకాలు మాత్రమే సాధించగలిగాం. అప్పటికీ ఐదో స్థానంలో నిలిచాం. ఇప్పుడు హాంగ్‌జౌలో నిర్వహించిన ఆసియా క్రీడల్లో భారతదేశం పతకాల సాధనలో నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం పతకాల సంఖ్య మాట ఎలా ఉన్నా, ఈ ర్యాంకుల విషయంలో స్వర్ణ పతకాల సంఖ్యనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఎవరికి ఎన్ని ఎక్కువ స్వర్ణాలు వస్తే వారికి అంత మంచి ర్యాంకు వస్తుందన్న మాట. నాలుగేళ్లకోసారి నిర్వహించే ఆసియా క్రీడల్లో ఇంతకుముందు 2018లో జకార్తాలో నిర్వహించినప్పుడు మనకు 16 స్వర్ణ పతకాలు, 23 రజత పతకాలు, 31 కాంస్య పతకాలు కలిపి మొత్తం 70 పతకాలు వచ్చాయి. ఇలా గతంలో ఏ ఆసియా క్రీడలతో పోల్చినా ఈసారి భారతదేశానికి చాలా మంచి ర్యాంకు వచ్చింది, అత్యంత ఎక్కువ.. అది కూడా వంద దాటి పతకాలు తొలిసారి లభించాయి. ఇది చూసి, మనవాళ్ల ప్రతిభా పాటవాలు చూసి యావజ్జాతి ఉప్పొంగిపోయింది. కబడ్డీ, క్రికెట్‌లతో పాటు విలువిద్య, బ్యాడ్మింటన్‌ లాంటి క్రీడల్లోనూ ఇండోనేషియా, కొరియా, చైనాలాంటి దిగ్గజ దేశాల క్రీడాకారులను ఓడించి మరీ మనం స్వర్ణ పతతకాలు సాధించడం నిజంగా ఘనంగా చెప్పుకోవాల్సిన విషయమే. మన బద్ధశత్రువు పరిస్థితి ఏంటి? శత్రువు మనకంటే బలవంతుడు అయినప్పుడు వాడిని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్నిఉంటాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల భూభాగం మొత్తాన్ని కలిపేసుకోవాలన్న దుర్బుద్ధితో ఉన్న చైనా.. ఎప్పటి నుంచో మనకు పక్కలో బల్లెంలా ఉంది. ప్రతిదానికీ మనం చైనాను తిట్టుకుంటూ ఉంటాం. చైనా ఫోన్లు నాణ్యంగా ఉండవని, చైనా వస్తువులంటే చాలా చవకరకం అని ఒక రకమైన అభిప్రాయం మనందరికీ ఉంటుంది. అంతవరకు ఎందుకు.. ఇటీవల కోవిడ్‌ మహమ్మారి విజృంభించినప్పుడు కూడా ప్రపంచం మొత్తం చైనావైపే వేలెత్తి చూపించింది. వుహాన్‌ ల్యాబ్‌ నుంచి లీకైన వైరస్‌ దీనంతటికీ కారణమని తిట్టిపోశారు. అప్పటి నుంచి చైనాను ఒక రకంగా సామాజిక బహిష్కరణ కూడా చేశారు. ఇన్ని విషయాల్లో అందరితో మాటలు పడుతున్న చైనా.. ఈ ఆసియా క్రీడల్లో ఎక్కడుందో ఒక్కసారి చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. 200 స్వర్ణ పతకాలు, 111 రజత పతకాలు, 71 కాంస్య పతకాలు.. మొత్తం కలిపి 382 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. అంటే మనకు వచ్చిన మొత్తం పతకాల కంటే దాదాపు రెట్టింపు స్వర్ణ పతకాలు చైనాకు వచ్చాయన్న మాట. ఏదో ఆసియా ఖండంలోనే కదా.. చిన్న చిన్న దేశాలతో పోటీ పడితే ఇవేంటి, ఇంకా ఎక్కువ వస్తాయి, ఒలింపిక్స్‌ క్రీడల్లో సత్తా చూపిస్తే అప్పుడు తెలుస్తుంది అంటారా.. 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో అగ్రస్థానంలో అమెరికా నిలిచింది. ఆ దేశానికి 39 స్వర్ణ పతకాలు, 41 రజత పతకాలు, 33 కాంస్య పతకాలు కలిపి మొత్తం 113 వచ్చాయి. రెండో స్థానంలో నిలిచింది చైనా. వాళ్లకి 38 స్వర్ణ పతకాలు, 32 రజత పతకాలు, 19 కాంస్య పతకాలు కలిపి మొత్తం 89 వచ్చాయి. అదే క్రీడల్లో మన పరిస్థితి ఏంటా అని చూస్తే.. ఒకే ఒక్క స్వర్ణ పతకం (నీరజ్‌ చోప్రా పుణ్యం), రెండు రజత పతకాలు, నాలు గంటే నాలుగే కాంస్య పతకాలు కలిపి మొత్తం ఏడు పతకాలతో సరిపెట్టుకున్నాం.

- Advertisement -

వాళ్లది ఎందుకీ ముందంజ?

మనమెక్కడ వెనకబడ్డాం? ఇప్పుడు కాదు.. చైనా ఎప్పటినుంచో క్రీడారంగంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రతిసారీ ఏ స్థాయి క్రీడాపోటీ లైనా ఒకటి లేదా రెండో స్థానాల్లో ఉండేందుకు గట్టిగా పోటీ పడుతోంది. అందుకు వాళ్లు పిల్లల చిన్నతనం నుంచి ఇప్పించే కఠిన శిక్షణే కారణం. అక్కడి పిల్లలు, లేదా తల్లిదండ్రులకు క్రీడల్లో ఆసక్తి ఉంటే, ఏడాది వయసు ఉన్నప్పటి నుంచే వారికి ప్రాథమిక శిక్షణ ఇవ్వడం మొదలుపెడతారు. అది కూడా చాలా కఠినంగా ఉంటుంది. పిల్లలు కందిపోతారేమో, నలిగిపోతారేమో అన్న భయాలు ఏమీ లేకుండా వివిధ క్రీడాంశాల్లో పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చి, వాళ్లను మెరికల్లా తయారుచేస్తారు. అంతేకాదు, క్రీడా సంఘాలలో రాజకీయాలు చేయడం, తమవాళ్లను పైకి తీసుకొచ్చి ప్రతిభావంతులను తొక్కే యడం లాంటివి పొరపాటున కూడా కనిపించవు. కానీ మన దేశంలో తల్లిదండ్రులకు ఆసక్తి ఉండి, పిల్లలను చిన్నతనం నుంచి కోచ్‌ల వద్దకు తీసుకెళ్లినా, ఇప్పుడే వద్దని, ఇంకా వాళ్లు ఎదగాలని, ఈలోపు పార్కులకు తీసుకెళ్లి ఆడించాలని చెబుతారు. విజయవాడలో జరిగిన ఒక సంఘటన ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇది దాదాపు పాతికేళ్ల క్రితం నాటి మాట. అక్కడ జిమ్నాస్టిక్స్‌ కోచ్‌ ఒకరు చాలా ప్రముఖుడు. ఆయన దగ్గర తమ కుమార్తెకు కోచింగ్‌ ఇప్పిద్దామని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అప్పటికి ఆ పాప వయసు రెండేళ్లు. ఇంట్లోనే శరీరం తీగలా వంచుతుండటం, బాగా ఆడుకోవడం చూసి.. జిమ్నాస్టిక్స్‌ క్రీడలో రాణిస్తుందని భావించారా తల్లిదండ్రులు. వాళ్లను ఆ కోచ్‌ తీవ్రంగా నిరాశపరిచి, ముందు పాపని పార్కుకు తీసుకెళ్లాలని, అక్కడ బాగా ఆడుకోవడం వచ్చిన తర్వాత ఆరేళ్ల వయసులో తన దగ్గరకు తీసుకురావాలని చెప్పారు. అప్పుడు కూడా కొన్ని ఇంటి దగ్గర చేయడానికి చెబుతామని, కనీసం 11 ఏళ్లు వస్తే గానీ శిక్షణ ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు. అదే చైనాలో అయితే ఏడాది వయసు నుంచే పిల్లలకు ఏ క్రీడలోనైనా శిక్షణ ఇస్తారు. అందుకే అక్కడ క్రీడాకారులు రాణిస్తున్నారు. పైపెచ్చు మన దేశంలో క్రికెట్‌ నుంచి ప్రతి క్రీడలోనూ రాజకీయాలు రాజ్యమేలుతుంటాయి. ఎంతటి ప్రతిభ ఉన్నా, అవకాశాలు రావడం చాలా కష్టం. క్రీడాసంఘాల పెద్దలు గానీ, కొన్ని అకాడమీల అధినేతలు గానీ వాళ్లు మెచ్చిన వారికే అవకాశాలు ఇప్పిస్తుంటారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకుని, మట్టిలో మాణిక్యాలను వెలికితీసి, వారికి తగిన శిక్షణ, అవకాశాలు కల్పిస్తే మనం క్రీడల్లో కూడా చైనాతో పోటీ పడగలం. ఇప్పటికే జనాభా సంఖ్య విషయంలో చైనాను దాటేసిన మనం… మిగిలిన విషయాల్లో మాత్రం ఆ దేశంతో పోటీ విషయమే ఆలోచించడం లేదు. శత్రువైనా సరే వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. అవి నేర్చుకుంటనే మనం ముందడుగు వేయగలం.

సమయమంత్రి చంద్రశేఖర శర్మ

– 7674869432

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News