నల్లమలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకు గణనీయంగా తగ్గడంతో చెంచులు గజగజ వణుకుతున్నారు. ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా ఎముకలు కొరికే చలితో చచ్చి బతుకుతున్నారు. ఉదయం 10 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. మంచుతో కూడిన గాలులు వీయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకెళ్లాలంటేనే భయపడుతున్నారు. రాత్రి సమయంలో చలి తీవ్రతను తట్టుకునేందుకు చలి కుంపట్లు పెట్టుకొని పడుకుంటున్నారు.
42 చెంచు గూడాలు
నల్లమల అభయాణ్యంలో చలి పంజావిసురుతోంది. ఉష్ణోగ్రత పూర్తిగా పడిపోవడంతో చెంచులు చలి తీవ్రతను తట్టుకోలేక పోతున్నారు. ఉదయం మంచుతో కూడిన గాలులు వీయడంతో ఇంట్లోనుంచి అడుగు బయట పెట్టలేకపోతున్నారు. నంద్యాల జిల్లాలోని నల్లమల అభయారణ్యంలోని సుమారు 42 చెంచు గూడెంలు ఉండగా దాదాపు 2160 కుటుంబాలు, 8200 పైగా జనాభా జీవనం సాగిస్తున్నారు. వీరికి సరైన మౌలిక వసతులు లేకపోవడంతో బొడ్డు గుడిసెలలోనే జీవనం కొనసాగిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చలి తీవ్రత అధికంగా ఉండడంతో పూరి గుడిసెలలో చెంచులు గజగజ వణుకుతున్నారు.
చలి మంటలే దిక్కు!
చలి నుంచి కాపాడుకునేందుకు నిరంతరం చలి మంట వేసుకుంటున్నారు. రాత్రి నిద్రించే సమయంలో కూడా నెగళ్లు పెట్టుకొని పడుకుంటున్నారంటే చలి తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో వయోవృద్ధులు, పిల్లలు, మహిళలు, దీర్ఘకాలిక వాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలి నుంచి రక్షించుకునేందుకు అవసరమైన దుప్పట్లు కూడా లేక వణికి పోతున్నారు. ఐటీడీఏ ద్వారా దుప్పట్లు పంపిణీ చేసి, చలి తీవ్రత నుంచి కాపాడాలని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.