BITS Pilani Goa Student Found Dead in Hostel: గోవాలోని ప్రముఖ విద్యాసంస్థ బిట్స్ పిలానీ క్యాంపస్‌లో వరుసగా జరుగుతున్న మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఒక 20 ఏళ్ల విద్యార్థి తన హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని రిషి నాయర్‌గా పోలీసులు గుర్తించారు. గురువారం ఉదయం సుమారు 10.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రిషి తన మొబైల్ ఫోన్‌కు ఎంతసేపు కాల్ చేసినా స్పందించకపోవడంతో హాస్టల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో వారు అతని గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే రిషి తన మంచంపై కదలకుండా పడి ఉన్నాడు. వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు.
ఏడాదిలోపే ఐదు మరణాలు..
అయితే, బిట్స్ పిలానీ క్యాంపస్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది తొలిసారి కాదు. 2024 డిసెంబర్ నుంచి ఇది ఐదో ఘటన కావడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. గతంలో ఓం ప్రియన్ సింగ్ (డిసెంబర్ 2024), అథర్వ దేశాయ్ (మార్చి 2025), కృష్ణ కసేరా (మే 2025), మరియు కుశాగ్ర జైన్ (ఆగస్ట్ 2025) కూడా వారి హాస్టల్ గదుల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇలా వరుసగా విద్యార్థుల మరణాలు చోటుచేసుకోవడంతో, ఈ ఘటనల వెనుక అసలు కారణాలు ఏమిటనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ALSO READ: Ganesh Procession: గణేష్ నిమజ్జనం ఊరేగింపులో విషాదం.. ముగ్గురు మృతి, 22 మందికి గాయాలు
కలెక్టర్ నేతృత్వంలో కమిటీ..
ఈ ఘటనలపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించామని ఆయన తెలిపారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. కాగా, ఈ ఘటనపై ఇప్పటివరకు బిట్స్ పిలానీ యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దేశంలో అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన బిట్స్ పిలానీలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ALSO READ: Man Kills Minor Fiancée: మైనర్‌తో ప్రేమ.. నిశ్చితార్థం.. గొడవపడి గొంతు నులిమి చంపేసిన ప్రియుడు


