GST 2.0 Benefits: దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం భారత ఆర్థిక వ్యవస్థలో కొత్త వృద్ధికి పునాదిగా కాబోతోంది. మధ్యతరగతి ప్రజలకు ప్రధాని మోడీ ప్రకటించిన జీఎస్టీ దీపావళి బహుమతి కొత్త ఆశలు చిగురింప చేస్తోంది. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం కూడా జీఎస్టీ సంస్కరణల కారణంగానేనని బ్రోకరేజ్ సంస్థలు, మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే జీఎస్టీ రేట్ల మదింపు, స్లాబ్ రేట్ల తగ్గింపుతో సామాన్య భారతీయుడికి ఏం దక్కనుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా జీఎస్టీ రేట్లను ప్రస్తుతం ఉన్న 4 స్లాబ్ల నుంచి రానున్న కాలంలో 2 స్లాబ్లకు తగ్గుతుందని ప్రధాని మోడీ ప్రకటించారు. ఇది ఏఏ రంగాలపై సానుకూలతను కలిగి ఉంటుందనే విషయాన్ని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎంకే గ్లోబల్ వెల్లడించింది. జీఎస్టీ 2.0 సంస్కరణలు ప్రధానంగా భారతీయుల కొనుగోలు శక్తిని పెంచి కన్జూమర్ గూడ్స్ రంగాల్లోని వ్యాపారాలకు మేలు చేస్తుందని.. తద్వారా డిమాండ్ పెరిగి కంపెనీల ఆదాయాలు రానున్న త్రైమాసికాల్లో మెరుగుపడతాయని వెల్లడించింది.
Also Read: Chandrababu Naidu Warning: ఎన్టీఆర్‌పై అసభ్య పదజాలం.. టీడీపీ ఎమ్మెల్యేకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్
రానున్న కాలంలో కేవలం 5 శాతం అలాగే 18 శాతం అనే రెండు రేట్లు ఉండటం వల్ల చాలా వస్తువుల ధరలు తక్కువ స్లాబ్ రేట్లకు తగ్గవచ్చని బ్రోకరేజ్ చెప్పింది. దీని కారణంగా దేశంలోని ఆటో రంగం, ఏసీలు, సిమెంట్, ఇన్సూరెన్స్, నిత్యావసరాలు, గృహోపకరణాలపై అమలులో ఉన్న అధిక జీఎస్టీ రేట్లు తగ్గుతాయని.. కంపెనీలు తగ్గిన రేట్లను వినియోగదారులకు చేర్చటం ద్వారా వినియోగం పెరుగుతుందని బ్రోకరేజ్ సంస్థ ఎంకే గ్లోబల్ చెప్పింది. అలాగే ఇదే సమయంలో పైన వెల్లడించిన రంగాల్లోని కంపెనీల ఆదాయాలు మెరుగుపడటం వల్ల పెట్టుబడిదారులు కూడా రానున్న కాలంలో మంచి లాభాలను చూస్తారని తేలింది.
ప్రస్తుతం సున్నా శాతం జీఎస్టీ రేటు కిందకు పాలు, గుడ్లు, కూరగాయలు, పండ్లు, ప్యాకింగ్ చేయని ధాన్యాలు, శానిటరీ న్యాపికిన్స్, పుస్తకాలు, న్యూస్ పేపర్, ఖాదీ వస్త్రాలు, వ్యవసాయ ఉపకరణాలు, వినికిడి వస్తువులు ఉన్నాయి. అయితే రానున్న కాలంలో ప్రజలకు అవసరమైన మరిన్ని వస్తువులు కూడా సున్నా నుంచి 5 శాతం మధ్య స్లాబ్ రేట్ల కిందికి వస్తాయని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా దీనిపై ప్రకటన చేయనప్పటికీ.. ప్రధాని మోడీ ఇచ్చిన సంకేతాలు అమెరికా టారిఫ్స్ సమయంలో భారత వృద్ధిని పునరుద్ధరించటానికి కీలకమైనవిగా భావిస్తున్నట్లు బ్రోకరేజ్ చెప్పటం గమనార్హం. ఇవి ప్రజల సొంతింటి కలల నుంచి వాహనం కొనుక్కోవాలనే కోరిక వరకు జీఎస్టీ భారాన్ని తగ్గించనుండటం ఒక కీలక అంశంగా మారింది.


