ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మన శరీరం పంచభూతాలైన గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్నిలతో నిర్మితమైంది. పంచభూతాలతో తయారైన వస్తువులు, ఆహారం వినియోగంతోనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించగలమని ప్రకృతి వైద్యులు చెప్పే మాటలు మనం పెడచెవిన పెడతాం. మన పూర్వీకులంతా ఈ ప్రకృతి సూత్రాలతోనే ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుష్షును పొందారు.
బ్రిటీషర్స్ శిక్ష ఇదే
బ్రిటిష్‌వారు భారతదేశాన్ని పరిపాలించే కాలంలో జైళ్లలో ఉన్న స్వాతంత్య్ర సమరయోధులకు అల్యుమినియం పాత్రల్లో ఆహారాన్ని వండి వడ్డించేవారట. ఆ పాత్రల్లో వండిన ఆహారాన్ని భుజించిన వారికి రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, కాలేయ సమస్యలు, కేన్సర్ లాంటి వ్యాధులొస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. భారతీయుల వంటిళ్లలో పూర్వం నుంచీ మట్టి పాత్రలుండేవి. గ్రామాల్లోని చెరువుల నుంచి బంకమట్టిని తెచ్చి శుద్ధి చేసి వంట పాత్రలు తయారు చేసేవారు. వాటినే ప్రజలు ఉపయోగించేవారు. దీనివల్ల వారికి ఆరోగ్యం, కుమ్మరి వృత్తిదారులకు ఉపాధి లభించేది. ఆధునికత పేరుతో మట్టి పాత్రల స్థానంలో అల్యుమినియంతో తయారైన కుక్కర్లు, వంట పాత్రలు వంటిళ్లలోకి చేరడం వల్ల రోగాలు ఇళ్లలో తిష్ఠ వేస్తున్నాయని ఆయుర్వేద వైద్యులు హెచ్చరిస్తున్నారు. మట్టి పాత్రల్లో, సేంద్రియ పద్దతుల్లో వండిన ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారా ఆరోగ్యవంతులవుతారని వారు సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని విద్యార్థుల్లో ఫ్లోరైడ్, ఎదుగుదల లోపానికి అల్యుమినియం పాత్రల్లో మధ్యాహ్న భోజనం వండి వడ్డించడం ఒక కారణమని నిపుణులు గుర్తించారు. అల్యుమినియం స్థానంలో హిండాలియం వంట పాత్రలు సరఫరా చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించిందంటే అల్యుమినియం పాత్రల దుష్ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.
మన ఆరోగ్యంలోనే కుమ్మర్ల జీవనం
మట్టిపాత్రల తయారీ వృత్తిపై ఆధారపడి కుమ్మర్ల కుటుంబాలున్నాయి. ప్రభుత్వం, ప్రజలు మట్టిపాత్రలను ఆదరించి, ప్రోత్సహిస్తే ప్రజలకు ఆరోగ్యం, వృత్తిదారులకు ఉపాధి లభిస్తుంది. అంటే మన కులవృత్తులకు ఆరోగ్యానికి ఎంత పెద్ద అవినాభావ సంబంధం ఉందనే లోతు మీకు ఇప్పుడైనా బోధపడిందా.
అన్ని రకాల మట్టి పాత్రలు
కుమ్మరి వాళ్లు కేవలం కుండలే కాదు వంట పాత్రలు, డెకరేటివ్స్ ఇలా చాలా చేస్తారు. ఇప్పుడు మళ్లీ పాత రోజులొస్తున్న నేపథ్యంలో మట్టి కుక్కర్, ఫ్రిజ్ మొదలు కర్డ్ సెట్టర్, పెన్నాలు, బాణళ్లు, వాటర్ బాటిళ్లు ఇలా అన్ని వస్తువులు మట్టితో తయారు చేసి వీరు క్రమంగా లాభాలబాటలో పడే పనుల్లో బిజీగా ఉన్నారు. అన్నం వండడానికి మట్టి కుండలు, కూరలు వండడానికి అటికెలు, పెరుగు తోడు పెట్టడానికి పాత్రలు, భోజనం చేయడానికి పళ్లాలు, గ్లాసులు, జగ్గులు, కూజాలు, కుండలు, వాడుతున్నారు.
మట్టి పాత్రల వల్ల లాభాలు
పంచభూతాల్లో ఒకటైన మట్టి నుంచి తయారైన పాత్రల్లో ఆహార పదార్థాలు వండడం వల్ల మానవ శరీరానికి ఎన్నో ఉపయోగాలున్నాయి. మట్టి పాత్రలు అంతటా అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం మూలంగా ఆరోగ్యం లభిస్తుంది. సానుకూల శక్తి అందుతుంది. మట్టిలోని క్యాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్ లాంటి 19 రకాలకు పైగా మైక్రో న్యూట్రియంట్స్ మట్టి పాత్రల్లో వండడం వల్ల ఆహార పదార్థాలతో కలుస్తాయి. పైగా గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంకా చెప్పాలంటే ఇందులో వండిన పదార్థాలు త్వరగా చల్లగ అవ్వవు. ఆహారం త్వరగా చెడిపోకుండా ఉంటుంది.
మట్టి పాత్ర నిదానంగా వేడెక్కుతుంది. దీనివల్ల పాత్రలోని ఆహార పదార్థాలు నిదానంగా, తగినంత ఉష్ణోగ్రతతో ఉడుకుతాయి. పోషక విలువలు ఏమాత్రం నష్టం కాకుండా ఉంటాయి. ఆహార పదార్థాల ఉత్పత్తి సమయంలో వాడే క్రిమి సంహారకాల అవశేషాలను నిర్వీర్యం చేసే శక్తి మట్టిపాత్రలకు ఉంటుంది.
ఆహారం క్షారగుణం నష్టపోకుండా ఉంటుంది. తక్కువ నూనెతోనే వంట పూర్తవుతుంది. మట్టి పాత్రలో పెరుగు సరిగా తోడుకుని కమ్మగా ఉంటుంది. త్వరగా పులుపెక్కదు. వంటలు మంచి రుచి రావాలంటే మట్టి పాత్రలనే ఎంచుకోవాలి.
పర్యావరణానికి హాని చేయవు
పగిలిపోయి, ఉపయోగంలో లేని మట్టి పాత్రలు పారేసినా తొందరగా భూమిలో కలిసిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదు. రిఫ్రిజిరేటర్‌ల కంటే మట్టి కుండల్లోని నీళ్లు చల్లగా ఉంటాయి. కుండల్లోని నీళ్లే ఆరోగ్యానికి మంచిది. అందుకే మనకు, మన పర్యావరణానికి హాని కలిగించని మట్టి పాత్రల ఉపయోగాన్ని మనం ప్రోత్సహిద్దాం. ఈ వేసవి నుంచే ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుడదాం.
K. గౌతం, ఆందోల్.