Sunday, December 8, 2024
HomeNewsCM Revanth on water bodies kabja: చెర్వులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకూడదంటూ...

CM Revanth on water bodies kabja: చెర్వులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకూడదంటూ సీఎం రేవంత్ ఆదేశాలు

హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అర్హులైన పేదలకు భరోసా కల్పించేందుకు తప్పకుండా ప్రయత్నం చేయాలని అధికారుల కు సూచించారు. అర్హులైన పేద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని, వారికి డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని, లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు.

- Advertisement -

ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణను బాధ్యతగా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కాపాడుకోవాల్సిన అవశ్యాన్ని గుర్తు చేశారు.

ఇకపై చెర్వులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా సిటీలో ఉన్న అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని చెప్పారు.

అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటినీ గుర్తించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని చెప్పారు. హైదరాబాద్ సిటీలో అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రతీ చెరువు, నాలాల ఆక్రమణల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో నిజమైన, అర్హులైన పేదలకు నష్టం జరగకుండా ప్రభుత్వం చేపట్టే చర్యలుండాలని అప్రమత్తం చేశారు.

జూబ్లీ హిల్స్ లో నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రో రైలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలని చెప్పారు. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి, పరిష్కరించాలని సూచించారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్టతో పాటు మెట్రో విస్తరణకు సంబంధించి పలు అంశాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. దసరాలోపు మెట్రో విస్తరణ రూట్ కు సంబంధించి పూర్తిస్థాయి డీపీఆర్ ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలని సీఎం చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News