ప్రధాని మోడీ(PM Modi) కులంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రేపుతున్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీతో పెట్టుకున్న కేజ్రీవాల్, కేసీఆర్ ఏమయ్యారో గుర్తుకు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే.. మరోసారి మోడీ కులంపై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోడీని తాను వ్యక్తిగతంగా దూషించలేదని ఆయన కులం గురించి మాత్రమే చెప్పానని సమర్థించుకున్నారు. మోడీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే జన గణనలో కులగణన చేసి చూపించాలని డిమాండ్ చేశారు.
ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో తనకు ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సూచనలతోనే తాను పనిచేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎవరూ చేయలేని విధంగా బీసీ కులగణన చేశామన్నారు. అప్పుడు మిస్ అయిన వారి కోసం మరోసారి కులగణన చేస్తున్నామని తెలిపారు. కులగణనలో ఒక్క తప్పు ఉన్నా చూపించండి అని విపక్షాలకు సవాల్ విసిరారు. 42% బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తామన్నారు. ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా తాను పట్టించుకోనన్నారు. అంతకుముందు సోనియా, రాహుల్ గాంధీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే.