Covid 19: చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కోరలు చాచి మళ్లీ ఆనాటి పరిస్థితులను తెస్తోంది. అంతకుముందుతో పోలిస్తే కేసులు రెట్టింపవుతూ అక్కడి ప్రజలను కలవరపెడుతుంది. 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ రకంతో పాటు డెల్టా కేసులు పెరగడంతో ఆందోళన కనిపిస్తుంది. ఈ మధ్యే చైనాలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కేసులు తీవ్రంగా నమోదయ్యే ఈశాన్య చైనాలోని చాలా నగరాల్లో లాక్ డౌన్ ను విధించారు.
అయితే, కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో 15 రోజుల క్రితమే కరోనా నిబంధనలు సడలించారు. దీంతో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా మహమ్మారి ఉదృతి పెరిగింది. ఒమిక్రాన్ రకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో రాజధాని బీజింగ్ తో పాటు పలు నగరాల్లో ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలాచోట్ల ఆసుపత్రుల ముందు రోగులు గంటల తరబడి వేచి ఉంటుండగా.. ఎక్కువ శాతం కేసులలో విపరీతమైన జ్వరం కనిపిస్తున్నట్లు అక్కడి మీడియా పేర్కొంటుంది.