Sunday, November 24, 2024
HomeNewsDont drink too much water: నీళ్లే కదా అని ఎక్కువగా తాగకండి

Dont drink too much water: నీళ్లే కదా అని ఎక్కువగా తాగకండి

నీళ్లు బాగా తాగితే మంచిదంటారు. కానీ ఏదీ అతిగా ఉండకూడదు. మంచినీళ్లకు కూడా ఇది వర్తిస్తుంది. అతిగా మంచినీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. శరీరానికి ఎంత అవసరమో అన్ని నీళ్లు మాత్రమే తాగాలి. అలా కాకుండా ఎక్కువ నీళ్లు తాగితే శరీరంలో ఉండే ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటుంది. శరీరంలోని సోడియం ప్రమాణాలు పడిపోయి ప్రమాదస్థితికి వెడతాం. శరీరంలో ఫ్లూయిడ్స్‌ సమతుల్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగాలని వైద్యులు చెప్తారు.
చాలామంది ఎక్కువ నీళ్లు తాగితే బరువు తగ్గుతామని, శరీరంలోని మలినాలు బయటకు పోతాయని భావిస్తుంటారు. ఎక్కువ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని కూడా అనుకుంటారు. కానీ అది కూడా పొరపాటే. అతిగా నీళ్లు తాగితే కొన్ని సందర్భాలలో ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలా చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని వైద్యులు చెప్తున్నారు. అతిగా నీళ్లు తాగడం వల్ల తలెత్తే అనారోగ్య పరిస్థితులను వాటర్‌ ఇంటాక్సికేషన్‌గా అభివర్ణిస్తారు. ఇలా ఎక్కువగా నీళ్లు తాగినపుడు ఒకరకమైన గందరగోళ స్థితికి మనుషులు లోనవుతారు. తీవ్రమైన తలనొప్పితో బాధపడతారు. వాంతులు చేసుకుంటారు. కోమా, ఫిట్స్‌ లాంటి పరిస్థితులు తలెత్తుతాయి. అది తీవ్రమైతే కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. నీళ్లు అతిగా తాగడం వల్ల శరీరంలోని రక్తంలో సమతుల్యత దెబ్బతిని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

- Advertisement -

ఆరోగ్యకరమైన ఆహారం, సరిపడినంత నిద్ర శరీరానికి ఎంత అవసరమో నీరు కూడా సరిపడినంత మాత్రమే తీసుకోవాలని లైఫ్‌సె్టైల్‌ న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. శరీరానికి హైడ్రేషన్‌ చాలా ముఖ్యం. కానీ ఎక్కువ నీళ్లు తాగితే మూత్రపిండాలు ఆ నీటిని యూరిన్‌ ద్వారా బయటకు పంపలేవు. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం తలెత్తుతుంది. అతిమూత్రవిసర్జన (పోలీయూరియా) రక్తంలో తక్కువ సోడియం (హైపోనట్రేమియా) వంటివి కూడా తలెత్తుతాయి. వీటితో పాటు వాపు, జీర్ణక్రియ సరిగా లేకపోవడం వంటివీ వస్తాయి. నిజానికి మనం ఇంతే నీరు తాగాలని కచ్చితంగా చెప్పలేం. సీజన్ల బట్టి, వ్యక్తి శారీరక స్థితిని బట్టి, యాక్టివిటీని బట్టి కూడా అది ఆధారపడి ఉంటుంది.

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే యూరిన్‌ ఎలా ఉంటోందన్నది తరచూ గమనించుకోవాలి. అది ఆకుపచ్చగా ఉన్నా, వాసన వస్తున్నా అపుడు నీళ్లు కొద్దిగా ఎక్కువగా తాగాలి. అలా చేస్తే యూరిన్‌లో ఇన్ఫెక్షన్లు ఉంటే పోతాయి. కిడ్నీ, గుండెజబ్బులు ఉండేవాళ్లు తక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది. రక్తంలో సోడియం తక్కువైతే మెదడు కణాల్లోకి నీరు వెళ్లి బ్రెయిన్‌ వాస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. శరీరంలో సోడియం ప్రమాణాలు ఎంతున్నాయో గమనించుకోవాలి. ఫ్లూయిడ్స్‌ను నియంత్రించడం ద్వారా సోడియం ప్రమాణాలను వైద్యులు సరిచేస్తారు. మంచినీళ్లు తీసుకోవడం వెనుక ఇన్ని సమస్యలు దాగున్నాయి. అందుకే మంచినీళ్లే కదా అని ఇష్టంవచ్చినట్టు తాగకండి. ఏది పరిమితి దాటినా ప్రమాదమని మరవకండి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News