Prashant Kishore Party Symbol: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) స్థాపించిన జన్ సురాజ్ (Jan Suraaj) పార్టీకి ఎలక్షన్ కమిషన్ అధికారక గుర్తుని కేటాయించింది. నిన్న (జూన్ 25)న ‘స్కూల్ బ్యాగ్’ గుర్తుని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ గుర్తు పార్టీకి అధికారికంగా వినియోగించుకోనుంది. రానున్న బీహార్ ఎన్నికల్లో ఈ పార్టీ అన్ని స్థానాల్లో (243) ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. తాజాగా ఈసీ కేటాయించిన గుర్తుతో ఎన్నికల బరిలో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
“స్కూల్ బాగ్” గుర్తే ఎందుకు?: బీహార్‌లో విద్యా రంగం, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించే లక్ష్యంతో జన్ సూరాజ్ పుట్టిందని ప్రశాంత్ కిషోర్ చాలా వేదికల్లో తెలిపారు. బీహార్‌ని గత 35 ఏళ్లు పాలించిన JDU(U)–RJD పార్టీలు విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించాయని ఆయన బహిరంగానే ఆరోపించారు. బడి పుస్తకాల బదులు పిల్లల చేతికి బీరు సీసాలు ఇచ్చి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేశారని దుయ్యబట్టారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యను అందించేందుకు జన్ సురాజ్ పార్టీని స్థాపించినట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. తాజాగా ఈసీ స్కూల్ బ్యాగ్‌ని పార్టీ సింబల్‌గా ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
పోటీ మహిళలకు ప్రాధాన్యం: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో దాదాపు 40 సీట్లకు పైగా మహిళలకు కేటాయిస్తామని ప్రశాంత్ కిషోర్ ప్రకటించాడు. అంతే కాకుండా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని.. డబ్బుతో ఓటర్లను ప్రలోభ పెట్టబోమని ఆయన తెలిపారు. కచ్చితమైన ప్రణాళికతో తమ పార్టీ ముందుకు సాగుతోందని పీకే స్పష్టం చేశారు. ప్రస్తుతం బీహార్‌లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇప్పటికే అభ్యర్థుల సీట్ల కోసం పైరవీలు ప్రారంభించారు.
త్రిముఖ పోరు ఉండేనా?: ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ, జేడీయూ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. కేంద్రంలో కీలకంగా ఉన్న నితీష్ కుమార్ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయనున్నాయి. ఇందుకు కారణం వీరు ప్రస్తుతం ఇండి కూటమిలో కలిసి ఉండటమే. మరో పక్కా వీరితో పోటి పడేందుకు జన్ సురాజ్ కూడా సిద్ధం అవుతోంది. దీంతో పోటీ గట్టిగానే ఉండనుంది. అయితే సర్వేలు మాత్రం ఎన్‌డీఏ కూటమికే గెలుపు అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నాయి. ఇదే సమయంలో గెలుపు ఏ మాత్రం సులువు కాదని హెచ్చరిస్తున్నాయి. దీనికి కారణం కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి బలంగా ఉండటమే కారణం.