Thursday, September 19, 2024
HomeNewsElection Expenditure: ఎన్నికల నిధులపై నియంత్రణ అసాధ్యమా?

Election Expenditure: ఎన్నికల నిధులపై నియంత్రణ అసాధ్యమా?

అచేతనంగా ఎన్నికల కమిషన్

ఎన్నికలు సమీపిస్తున్నాయంటే వివిధ పార్టీల నిధుల విషయం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఎన్నికల్లో వివిధ పార్టీలు ఎన్నికల్లో సేకరించే నిధుల మీదా, ప్రచారానికి చేసే వ్యయం మీదా తప్పనిసరిగా ఏదో విధమైన నియంత్రణ ఉండాలనేది దేశంలో చాలా కాలంగా వినిపిస్తున్న డిమాండ్ అయితే, దీనికి పరిష్కారమనేది ఎక్కడా కనిపించడం లేదు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ప్రధాన ఎన్నికల కమిషన్‌ ఈ విషయంలో చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. త్వరలో శాసనసభలు, లోక్‌ సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మళ్లీ ఈ నిధుల సేకరణ, వ్యయం అనే అంశాల మీదకు అందరి దృష్టి పడుతోంది. ఎన్నికలు వస్తున్నాయంటే దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు భారీ మొత్తాలలో నిధులు సేకరించడం ప్రారంభిస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, వీటికి లెక్కా పత్రం ఉండదు. పార్టీల ఎన్నికల ప్రచారానికి, ప్రలోభాలకు చేసే ఖర్చుకు అంతూ పొంతూ ఉండదు. త్వరలో జరగబోయే అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, మరో ఆరు నెలల్లో జరగబోయే లోక్‌ సభ ఎన్నికలలో కోట్లాది రూపాయలు కుమ్మరించడానికి పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. బహుశా ఈ నిధుల సేకరణ, వ్యయం ఇదివరకటి ఎన్నికల వ్యయం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉండవచ్చనే అభిప్రాయం కూడా కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ దాదాపు అచేతనంగా ఉండిపోవడం తప్ప దీనికి నిష్కృతి ఏమీ ఉండకపోవచ్చు.
అసలు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు నిధులు ఏ విధంగా సమకూరుతున్నాయనేది ఇందులో ప్రధానమైన విషయం. ఈ నిధుల సేకరణ, వ్యయాలకు సంబంధించిన వివరాలను వెల్లడి చేయకపోవడం మరో ముఖ్యమైన అంశం. అంటే, ఈ విషయంలో పారదర్శకతకు ఏమాత్రం అవకాశం ఉండదన్నమాట. ఇక పార్టీలు పరిమితులకు లోబడి నిధులు సేకరించడం, వ్యయం చేయడం వంటివి కలలో కూడా ఊహించని అంశాలనడంలో సందేహం లేదు. నిధుల సేకరణ మీద కాస్తో కూస్తో అదుపు ఉండడానికి 2014లో మోదీ ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టారు. నిధుల సేకరణ మీద నియంత్రణ ఉండడంతో పాటు, ఇదంతా పారదర్శకంగా కూడా ఉంటుందని ఆయన భావించారు. అయితే, అనుకున్నదొకటి అయింది ఒక్కటి అన్నట్టుగా ఈ బాండ్ల వ్యవహారం ఘోరంగా విఫలం అయింది. వాటిని ఎవరు కొంటున్నారో, ఎవరు అమ్ముతున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ బాండ్లను పాలక పక్షమే కొనుగోలు చేసింది. ప్రతిపక్షాలకు ఈ బాండ్లు అమ్మితే పాలక పక్షం మండిపడుతుందేమోననే భయం కొనుగోలుదార్లను వెంటాడింది.
ఇక నగదు ప్రవాహం విషయానికి వస్తే, ప్రభుత్వం నిధుల సేకరణ మీద మరో విధంగా పరిమితి విధించింది. పార్టీలకు ఏ వ్యక్తి లేదా ఏ సంస్థ విరాళం ఇచ్చినా రూ. 2,000 నుంచి రూ. 20,000 మధ్యలోనే ఉండాలంటూ ఒక నిబంధనను విధించింది. దేశంలోని రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేయడంలో సిద్ధహస్తులు. అవి ప్రతివారి దగ్గర నుంచి ప్రతి విరాళానికి రూ. 2,000లకు సంబంధించిన రసీదులను మాత్రమే తీసుకోవడం ప్రారంభించాయి. దాంతో ఈ ప్రయత్నం కూడా చివరికి అటకెక్కింది. ప్రభుత్వం ఆ తర్వాత అవతలివైపు నుంచి నరుక్కువచ్చే ప్రయత్నం చేసింది. కంపెనీలు ఏ పార్టీకి విరాళమిచ్చినా కొంత పరిమితి దాటి పోవడానికి అవకాశం లేకుండా కంపెనీల చట్టంలోనే సవరణ తీసుకు వచ్చింది. కంపెనీలు తమ నికర లాభంలో 7.5 శాతానికి మించి విరాళాలు ఇవ్వకూడదని నిబంధన విధించింది. సహజంగానే ఈ నిబంధనకు కూడా చివరికి నీళ్లు వదలాల్సి వచ్చింది. ఈ నల్లధనం రోజుల్లో ఇటువంటి నిబంధనలు విజయం సాధించే అవకాశాలు ఉండవు.
ఇది ఇలా ఉండగా, ఎన్నికల బాండ్ల వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఈ బాండ్ల వ్యవహారమంతా పాలక పక్షానికి మాత్రమే అనుకూలంగా ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు సాగించాయి. ఇందులో పారదర్శకత అనేది లేశమాత్రంగానైనా కనిపించడం లేదని కూడా అవి వ్యాఖ్యానించాయి. ప్రస్తుతం పిటిషన్‌ దార్లు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు. సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తే ఆ విధంగా చర్యలు తీసుకుందామని కేంద్ర ప్రభుత్వం కూడా ఎదురు చూస్తోంది. నిధుల సేకరణ విషయంలో ఎన్నికల కమిషన్‌ ఒక సిఫారసు చేసింది. వివిధ పార్టీలకు విరాళాలు అందజేయడానికి, స్వీకరించడానికి సంబంధించి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనే కొద్ది మార్పులు చేసి, విరాళాలపై పరిమితి విధించాలని అదొక ప్రతిపాదన తీసుకువచ్చింది. పార్టీల వద్ద ఉన్న విరాళాల మొత్తంలో 20 శాతానికి మించకుండా మాత్రమే ఎవరైనా విరాళం ఇవ్వాలని లేదా విరాళాల మొత్తం 20 కోట్ల రూపాయలను మించి పోకూడదని అది సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సిఫారసును అమలు చేస్తే మంచిదనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News