Saturday, November 23, 2024
HomeNewsFather of Indian Navy Chhatrapati Shivaji Maharaj: కలవరపెడుతున్న యుద్ధ నౌకల ప్రమాదాలు

Father of Indian Navy Chhatrapati Shivaji Maharaj: కలవరపెడుతున్న యుద్ధ నౌకల ప్రమాదాలు

అత్యంత పరాక్రమవంతుడైన మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు, పరాయి దేశాల దాడులను ఎదుర్కొనేందుకు 17వ శతాబ్దంలోనే ఎంతో దూరదృష్టితో సముద్ర యుద్ధతంత్రాలు మరియు వ్యూహరచనలతో నావికా దళాన్ని స్థాపించి పటిష్టమైన నౌకాదళ స్థావరాలను నిర్మించినందుకు “భారత నౌకాదళ పితామహుడు”గా పేరొందాడు. ఆయన అద్వితీయమైన కృషి భవిష్యత్తులో భారతదేశంలో సముద్ర కార్యకలాపాలకు మరియు అధ్యయనానికి పునాది వేసింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా తమ వాణిజ్య నౌకల రక్షణ కోసం 5 సెప్టెంబర్ 1612న భారతదేశంలో ఏర్పాటు చేసిన నౌకాదళం 2 అక్టోబర్ 1934 వరకు పలు ఇతర పేర్లతో పిలవబడి, తరువాత్ నుండి 26 జనవరి 1950న భారత గణతంత్ర రాజ్యంగా ఏర్పడే వరకు “రాయల్ ఇండియన్ నేవీ”గా కొనసాగిన పిదప “ఇండియన్ నేవీ”గా మారింది. భారత నౌకాదళం మొత్తం 1,42,000 (7,000 ఇండియన్ నేవల్ ఎయిర్ ఆర్మ్‌, 1,200 మంది మెరైన్ కమాండోలు మరియు 1,000 మంది సాగర్ ప్రహరీ బాల్‌ సిబ్బందితో కలిపి) మంది సిబ్బందితో ముంబైలో పశ్చిమ, విశాఖపట్నంలో తూర్పు మరియు కొచ్చిలో దక్షిణ నౌకాదళ కమాండ్‌లను నిర్వహిస్తోంది. పశ్చిమ, తూర్పు నౌకాదళ కమాండ్‌లు ఆపరేషనల్ కమాండ్‌లుగా అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతంలో కార్యకలాపాలపై నియంత్రణను పర్యవేక్షిస్తుండగా, సదరన్ కమాండ్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

- Advertisement -

కలవరపెడుతున్న ప్రమాదాలు:
2000 సంవత్సరంలో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టబడిన గైడెడ్-మిసైల్ ఫ్రిగేట్ యుద్ధ నౌక “ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర”కు జూలై 21, 2024న ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో మరమ్మతులు చేపడుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో, మంటలు ఆర్పేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నాలలో ఒక వ్యక్తి మరణించినప్పటికీ నౌకను నిటారుగా నిలబెట్టలేకపోయిన విషయం మనకు తెలుసు. 1990 నుండి శాంతికాల సమయంలో భారత నౌకాదళం ఐదేళ్ళకో నౌకను కోల్పోయినట్లు ఇండియా టుడే తన కథనంలో పేర్కొనడంతో పాటు జనవరి 2011 నుండి నవంబర్ 2014 మధ్య కాలంలో 24 యుద్ధ నౌకలు మరియు జలాంతర్గాములు ప్రమాదాలకు గురైనట్లు 2014లో నాటి రక్షణమంత్రి మనోహర్ పారిక్కర్ రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం తెలిపిన సందర్భాలు తీవ్ర ఆందోళన కలిగిస్తాయి. అంతేకాదు 2004 నుండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒక నౌకాదళ యోధుడిని భారత నౌకాదళం కోల్పోవడం విషాదకరం. శాంతికాల సమయంలో యుద్ధనౌకల నష్టాలు సర్వసాధారణమైనప్పటికీ, అభివృద్ధి చెందుతున్న మన లాంటి దేశాలు వాటిని తట్టుకునే ఆర్ధిక స్థితిలో లేవు. అందువలన ప్రమాదాల నివారణ భారత నౌకాదళానికి చాలా కీలకమైన అంశం. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన నాటి నుండి అమెరికా యొక్క 16 యుద్ధ నౌకలు ప్రమాదాల బారిన పడగా, 2000 సంవత్సరంలో శిక్షణా సమయంలో రష్యా అణు జలాంతర్గామి కుర్స్క్ ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. 2013 నుండి సంభవించిన ప్రమాదాలలో కొన్ని తీవ్రమైనవైనప్పటికీ, అధిక శాతం సాధారణ ప్రమాదాలను కూడా గోరంతలు కొండంతలుగా చేసి అసత్య ప్రచారం కల్పించినట్లు ఇండియా టుడే ఒక వ్యాసంలో అభిప్రాయపడింది.

ఏడవ స్థానంలో ఇండియన్ నేవీ:
వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ వార్ షిప్స్ ప్రకటించిన గ్లోబల్ నేవల్ పవర్ ర్యాంకింగ్స్-2024 నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 7వ స్థానంలో ఉంది. భారత నౌకాదళంలోని నౌకలను ప్రధానంగా ఏడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 1) విమాన వాహక నౌకలు (Aircraft Carriers) – యుద్ధ నౌక పైనుండి విమానాలు ప్రయాణించే ప్రత్యేక ఏర్పాటు 2) డిస్ట్రాయర్లు (Destroyers) – ప్రమాదకర మరియు రక్షణ పాత్రల కోసం అందుబాటులో ఉండే బహుముఖ ఉపరితల నౌకలు 3) ఫ్రిగేట్‌లు (Frigates) – తరచుగా ఎస్కార్ట్ మరియు గస్తీ మిషన్‌ల కోసం వినియోగించే బహుళ పాత్రల యుద్ధనౌకలు 4) కొర్వెట్‌లు (Corvettes) – తీరప్రాంత రక్షణ మరియు శీఘ్ర దాడుల కోసం రూపొందించబడ్డ చురుకైన చిన్న యుద్ధనౌకలు 5) జలాంతర్గాములు (Submarines) – నీటి అడుగున యుద్ధం, నిఘా మరియు శత్రువును నిరోధించేందుకు 6) గస్తీ నౌకలు (Patrol Vessels) – సముద్ర నిఘా, శోధన, రక్షణ మరియు తీరప్రాంత భద్రత కోసం 7) ఉభయచర యుద్ధ నౌకలు (Amphibious Warfare Ships) – దళాలు మరియు పరికరాల రవాణా కోసం వినియోగించేవి. ఏప్రిల్ 2024 నాటికి భారత నౌకాదళంలోని మొత్తం 294 నౌకలలో 2 విమాన వాహకాలు, 1 ఉభయచర రవాణా డాక్, 9 ల్యాండింగ్ షిప్ ట్యాంకులు, 12 డిస్ట్రాయర్లు, 12 యుద్ధనౌకలు, 1 అణుశక్తితో నడిచే అటాక్ సబ్‌మెరైన్, 17 సాంప్రదాయకంగా నడిచే అటాక్ సబ్‌మెరైన్లు, 6 ప్రతిఘటన నౌకలు, 4 ఫ్లీట్ ట్యాంకర్లు మరియు 137 పెట్రోలింగ్ నౌకలు ఉన్నాయి. దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటానికి భారత నౌకాదళం విమాన వాహక నౌకలు మరియు డిస్ట్రాయర్‌ల నుండి జలాంతర్గాములు మరియు పెట్రోలింగ్ నౌకలతో సర్వసన్నద్ధంగా ఉంటూ జాతీయ భద్రతను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు భారతదేశం యొక్క వ్యూహాత్మక నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో తయారైన అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి “ఐఎన్ఎస్ అరిఘాత్” విస్తృతమైన పరీక్షలు పూర్తిచేసుకుని అక్టోబర్ 2024లో భారత నౌకాదళంలో చేరడానికి సిద్ధంగా ఉంది.

ప్రమాద కారణాలు:
భద్రతా ప్రమాణాలను పాటించే విషయంలో 2014 వరకు కూడా భారత నౌకాదళంలో పటిష్టమైన సంస్థాగత కార్యాచరణ అందుబాటులో లేకపోవడం, కాలం చెల్లిన యుద్ధ నౌకలు, నిర్వహణకు సంబంధించి నిర్దిష్టమైన నియమాలు ఉన్నప్పటికీ సమయానుసారం మరమ్మత్తులు చేపట్టడంలో అలసత్వం, కొనుగోళ్ల ఆమోదం పొందడంలో రక్షణ శాఖలో పరిపాలనాపరమైన కాలయాపన మరియు పలు సందర్భాలలో మానవ తప్పిదాలు ప్రమాదాలకు సాధారణ కారణాలని చెప్పవచ్చు. సహజంగా నిరంతరం చలనంలో ఉండే యుద్ధ నౌకలలోని త్వరగా మండే స్వభావం గల పదార్థాలు, అధిక-వోల్టేజ్ విద్యుత్ పరికరాలు, వాతావరణ పరిస్థితులు, అలల తాకిడులు, ప్రకృతి వైపరీత్యాలు మరియు గ్రౌండింగ్ పరిస్థితులు నౌకా ప్రమాదాలకు ప్రధానంగా కారణమవుతున్నాయి. అయితే ప్రపంచంలోని భారీ నౌకాదళాలలో ఒకటైన భారతదేశపు యుద్ధనౌకలు ప్రతి సంవత్సరం సముద్రంలో 12,000 నౌకాదినాల పాటు విభిన్న సముద్ర జలాలు మరియు వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవలసి రావడంతో కొన్ని ప్రమాదాలు సంభవించడం సర్వసాధారణమని నావికారంగ నిపుణుల అభిప్రాయం. ప్రమాదాల అనంతరం చేపట్టిన విచారణలో మానవ తప్పిదాలు జరిగినట్లు రుజువైన సందర్భాలలో సంబంధిత కమాండ్ల నుండి ఆయా నౌకల కెప్టెన్లు తొలగింపబడ్డారు. ఐఎన్ఎస్ సింధురత్న (ఎస్59)లో జరిగిన ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ 26 ఫిబ్రవరి 2014న నాటి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, అడ్మిరల్ డికె జోషి తన పదవికి రాజీనామా చేసారు. యుద్ధ నౌకలు లేదా జలాంతర్గాముల కొనుగోలు, నిర్మాణం భారత నౌకాదళానికి అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఒక యుద్ధ నౌక లేదా జలాంతర్గామిని కోల్పోవడం వల్ల నౌకాదళ కార్యాచరణపై చాలా ప్రతికూల ప్రభావం పడుతుంది. కొత్త నౌకలు లేదా జలాంతర్గాములను సమకూర్చుకోవడం కేవలం అత్యధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే కాదు ఒక్కో యుద్ధనౌక లేదా జలాంతర్గామి నిర్మాణానికి ఎనిమిది నుండి పది సంవత్సరాల సమయం పడుతుంది. అందువలన తమ యుద్ధ నౌకలు మరియు ఇతర ఆస్తులను కాపాడుకోవడం భారత నౌకాదళానికి అత్యావశ్యకం. యుద్ధాలు లేని శాంతికాల సమయంలో యుద్ధ నౌకల నిర్వహణను సమర్థవంతంగా, ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మత్తులను చేపడుతూ ప్రమాదాల బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో పాటు భద్రతాంశాలపై ఎలాంటి రాజీ లేకుండా ప్రణాలికాబద్ధమైన కార్యాచరణతో ముందుకు సాగాలి. ఆగష్టు 1990 నుండి జూలై 2024 వరకు జరిగిన 27 ప్రమాదాలలో 59 మంది నౌకాదళ సిబ్బందితో పాటు ఇతరులు ప్రాణాలు కోల్పోగా పలువురు క్షతగాత్రులవడం అత్యంత బాధాకరమైన విషయం.

హిందూ మహాసముద్రంపై ఆధిపత్య పోరు:
హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం కోసం చైనా కొన్ని దశాబ్ధాలుగా తన నేవీని వేగంగా ఆధునీకరిస్తోంది. భారత్-చైనా మధ్య ఎప్పటి నుంచో కొనసాగుతున్న సరిహద్దు వివాదంతో పాటు ప్రత్యేకించి 2020లో గాల్వన్ లోయ వద్ద భారత్-చైనా దళాల మధ్య ఏర్పడిన ఘర్షణ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. హిందూ మహాసముద్రంలో చైనా అనుసరిస్తున్న వ్యూహాన్ని ‘స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్‌’ అంటారు. హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాలలో వ్యూహాత్మక నౌకాశ్రయాలు నిర్మించడం, చైనా నుంచి అక్కడకు చేరుకునేలా మౌలిక వసతుల్ని కల్పించడం, అవసరమైతే సైనిక ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగించుకోవడమే ఈ వ్యూహం. ఇంధన ప్రయోజనాలు, భద్రతా లక్ష్యాలను కాపాడుకునేందుకు మధ్య ప్రాచ్యం నుంచి దక్షిణ చైనా సముద్రం వరకూ ఉన్న సముద్ర మార్గాల్లో వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధి పేరుతో వివిధ దేశాల్లో చైనా నౌకాశ్రయాలను అభివృద్ధి చేసుకుంటూ పోతోంది. ఆఫ్రికాలోని జిబౌటీ, పాకిస్థాన్‌లోని గ్వాదర్‌లో ఓడరేవులను నిర్మించడంతో పాటు శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టును 99 ఏళ్ల లీజుకు తీసుకుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో నౌకాదళ పరిధిని పెంచుకోవడానికి ఈ పోర్టులు చైనాకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ విషయంపై రక్షణ రంగ నిపుణుడు, భారత నౌకాదళంలో ఉన్నత అధికారిగా పదవీ విరమణ చేసిన తరువాత ఢిల్లీలోని సొసైటీ ఆఫ్ పాలసీ స్టడీస్‌లో డైరెక్టర్‌గా పని చేస్తున్న సి ఉదయభాస్కర్ మాట్లాడుతూ, ఈ పరిణామం ‘ప్రమాదం’ అనే కంటే ఒక శాశ్వత సవాలు లాంటిదని, ఓడ రేవుల నిర్మాణం, మౌలిక వసతుల పెంపు సముద్రాల మీద చైనాకున్న బలానికి నిదర్శనంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. దీనిని భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా గమనించాలని ఆయన తెలిపారు. హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు పెరగడం భారతదేశానికి సహజంగానే గూఢచర్యపరంగా ఆందోళన కలిగించే అంశం.

కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలతో తన ఆస్తులతో పాటు సిబ్బందిని కూడా పరిరక్షించుకోవడం భారత నౌకాదళం ముందున్న తక్షణ కర్తవ్యం.

యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్
✆ 8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News