తన మన బేధం లేకుండా ధ్వజస్తంభం ఏర్పాటుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని డాక్టర్ పులి ప్రమీల రెడ్డి కోరారు. గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం శ్రీ వెంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణ దాత డాక్టర్ పులి ప్రమీలా రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో వీచిన గాలి దుమారాలకు దేవాలయంలోని ప్రధాన ధ్వజస్తంభం దేవాలయ ప్రాకారాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా నేలకొరిగిందని, బ్రహ్మోత్సవాలకు ముందే ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తేనే బ్రహ్మోత్సవాలు చేసుకోగలుగుతామని గుర్తుచేశారు.
ఆలయ చైర్మన్ ఎండోమెంట్ వారు అమెరికాలో ఉన్నటువంటి నాకు సమాచారం అందించి గుడి ప్రాకారాలు గుడి పునర్నిర్మాణం మీ చేతుల మీదే జరిగిందని ధ్వజస్తంభం ప్రతిష్టాపన కూడా మీ చేతుల మీదే జరగాలని మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలని కోరారని, వయస్సు పైబడిన రీత్యా మేము వ్యయ ప్రయాసలకోర్చి అంత దూరం రాలేమని మీరే దగ్గరుండి చూసుకోమని చెప్పగా మీరు తప్పకుండా రావాలని ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చామన్నారు.
కానీ ధ్వజస్తంభం పునః ప్రతిష్ఠాపన మహోత్సవం ఆగిపోయిందని తెలపడం ఎంతో బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి ఫోన్ ద్వారా సంప్రదించామని, స్థానికంగా ఉన్న సమస్యలకు సంబంధం లేకుండా దేవుడి కోసం ఒక భక్తురాలిగా ఇక్కడకు వచ్చామని, గార్లలోనే చదువుకున్నానని స్వగ్రామం రామాపురమని ఆమె వివరించారు. చిన్నప్పటినుండి ఈ దేవుడిపై అమితమైన భక్తి ప్రపత్తులు ఉన్నాయని దేవుడి కార్యక్రమంలో మీరందరూ ముందు నిలబడి దిగ్విజయంగా జరిపించి నన్ను పంపించాలని ఇక్కడ స్థానికంగా నేను ఉండటానికి రాలేదని ఆమె ప్రాధేయపడ్డారు.
ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసామన్నారు. దగ్గరుండి చేపించుకోండి అని చెప్పడంతో అన్ని ఏర్పాట్లు చేయగా కొంతమంది జరపడానికి వీలులేదంటూ అడ్డుపడడం ఎంతో బాధాకరమన్నారు. ఆలయ ఈవో నందనం కవిత ఫోను ద్వారా ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ప్రెస్ మీట్ లు జరుపకూడదని వార్నింగ్ ఇచ్చారని, ఈ గుడి అందరిదని గుడిలోని భక్తులను ఇబ్బందులకు గురిచేసేలా నేను ప్రవర్తించడం లేదని, ఏ విధమైన పార్టీల గురించి ప్రస్తావించడం లేదని ఎవరిని కించపరచడానికి రాలేదని కేవలం ఆ దేవుని భక్తురాలిగా ఇంత దూరం వచ్చామన్నారు.
ఈ దేవస్థానమే నాకు వైకుంఠమని ఆరోగ్యం సహకరించక పోయినా దేవుడి కోసం ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి వచ్చిన మమ్ములను ఇబ్బందులకు గురి చేయడం న్యాయమేనా అని ఆమె ప్రశ్నించారు. తన మన భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ముందుండి దైవకార్యం చేయించాలని ఆమె కోరారు. ఇక్కడి నుండి మమ్ములను సంతోషంగా పంపించేటట్టు చూడాలని ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగేంతవరకు ఇక్కడే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.