Githam University: యునైటెడ్ కింగ్‌డమ్ ఆధారిత ర్యాంకింగ్ ఏజెన్సీ ప్రచురించిన ప్రతిష్టాత్మక టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) ఇంపాక్ట్ ర్యాంకింగ్స్-2025లో గీతం యూనివర్సిటీ ప్రపంచ గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని డైరెక్టరేట్ ఆఫ్ అక్రిడిటేషన్, ర్యాంకింగ్ అండ్ ఐక్యూఏసీ( IQAC) విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్.రాజా ప్రభు శుక్రవారం ఒక ప్రకటనలో ద్వారా తెలియజేశారు.
ఐక్యరాజ్య సమితి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (SDGs)లో గీతం ర్యాంకు పొందినట్టు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ యూనివర్సిటీలు మాత్రమే ఈ ప్రత్యేకతను సాధించనట్టు తెలిపారు. స్థిరత్వం, విద్యా నైపుణ్యం, సామాజిక ప్రభావం పట్ల ‘గీతం’ దృఢమైన నిబద్ధతను ఈ విజయం తెలియజేస్తోందని పేర్కొన్నారు.
ఏడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (SDGs) సాధనలో, వంద ఉత్తమ ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గీతం గుర్తింపు పొందడం గొప్ప విజయంగా పేర్కొన్నారు. సరసమైన, స్వచ్ఛమైన శక్తి (Affordable and Clean Energy) విభాగంలో గీతం విశ్వవిద్యాలయం 81వ ర్యాంకు సాధించిందని, ఇది సంస్థ ప్రయాణంలో తొలి, అద్భుతమైన ఘనతగా రాజా ప్రభు అభివర్ణించారు.
గత నాలుగేళ్లుగా ఈ ర్యాంకింగులలో గీతం స్థిరమైన పురోగతిని ప్రదర్శిస్తోందని, 2022లో నాలుగు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (SDGs) విభాగాల్లో, 2023లో ఎనిమిది, 2024లో 12, ఈ ఏడాది 17 విభాగాల్లో గీతం యూనివర్సిటీ క్రమాభివృద్ధిని ప్రదర్శించినట్టు ఆయన వివరించారు.
ఈ మైలురాయిని చేరుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ డాక్టర్ రాజా ప్రభు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచ ప్రమాణాలను అందుకోవడానికి గీతం కట్టుబడి ఉందని, అన్ని వేదికలలో ఈ గర్వించదగ్గ క్షణాలను పంచుకోవడాన్ని కొనసాగిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.
Times Higher Education Impact Rankings: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్-2025లో ’గీతం’ ప్రపంచ గుర్తింపు
- Advertisement -