Hanumanth shinde: బతుకమ్మ పాటలు.. రంగురంగుల పూల అలంకరణలతో బిచ్కుంద మున్సిపాలిటీలో పండుగ సందడి నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ వేడుకలను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొని మహిళలతో కలిసి సందడి చేశారు.
బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో నిర్వహించిన వేడుకల్లో మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పూజలు చేశారు. సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ పండుగ వాతావరణం కనిపించింది. వేడుకలకు హాజరైన హన్మంత్ షిండేకు స్థానిక మహిళలు, ప్రజలు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతిపై మనకున్న అనుబంధానికి ప్రతీక అని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఇలాంటి సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని సూచించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

