ఏండ్లు గడుస్తున్నా కూడా ఇల్లంతకుంట మండల ప్రజల తలరాతలు మారటం లేదు. వర్షాకాలం వస్తే చాలు కల్వర్టులు పొంగిపొర్లటం,అధికారులు రాజకీయ నాయకులు సందర్శించడం సర్వసాధారణం అయింది. కానీ ఏండ్ల నాటి శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిలు, కల్వర్టుల స్థానంలో కొత్తవి నిర్మిస్తామని అసలు ఆలోచనే రాదు. దానికి ఉదాహరణ ఇల్లంతకుంట -నర్సక్కపేట, జవహరిపేట బిక్క వాగులు.అధికారులు.
రాజకీయ నాయకులు ఫోటోలకు ఫోజులు ఇవ్వటం తప్ప ఇంకేం చేస్తారులే అని ప్రజలు గొణుక్కుంటున్నారు. తమ సమస్యలు తీరాలంటే తామేం చేయాలో తమకు తెలుసు అని,తాము అత్యవసరంగా, స్వేచ్చగా తిరగగలిగే రోడ్డు రవాణా పరిస్థితులు ప్రభుత్వం కల్పించలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో వున్నామా ప్రజలు మదనపడుతున్నారు. ప్రజలను అనుక్షణం అప్రమత్తం చేయటంలో పోలీసు శాఖను అభినందిస్తూ అధికారులను, రాజకీయ నాయకులను తీవ్రంగా విమర్శిస్తున్నారు.ప్రజల కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలు, అధికారులు ఎందుకు అంటూ విమర్శిస్తున్నారు.
ఏదైనా వైద్య పరంగా అత్యవసరం అయితే మండల కేంద్రానికి వెళ్లాలంటే మొదలు ఈ వర్షం తగ్గేదాకా ఓ నాల్గు రోజులు తమ ప్రాణాలు కాపాడాలంటూ ఆ దేవునికి మొక్కి తర్వాత వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. పోనీ అలా వెళ్లినా కూడా సౌకర్యాల లేమితో ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం దర్శనం ఇస్తుంది. ఇకనైనా మండల రాజకీయ నాయకులు, అధికారులు మేల్కొని మండల ప్రజల కనీస అవసరాల ద్రుష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.