Telangana Crime: బావ బాగు కోరేవాడే బావమరిది అని పెద్దలు అంటూ ఉంటారు. బావమరిది.. ప్రతిక్షణం బావ క్షేమాన్ని కోరుకుంటాడని చెబుతుంటారు. కానీ ఇక్కడ సీన్ మాత్రం రివర్స్. బావ చనిపోతే కానీ అక్క సంతోషంగా ఉండదని భావించిన బావమరది, చావు బతుకుల్లో ఉన్న బావను.. చావరా అంటూ చెరువు వద్ద పడేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే
కరీంనగర్ నగరంలోని మంకమ్మతోటకు చెందిన రాజు మొయినుద్దీన్ (43).. 13 ఏళ్ల క్రితం ఆర్మూర్‌కు చెందిన షేక్ లాయక్ అక్కను వివాహం చేసుకున్నాడు. అయితే రాజు మొయినుద్దీన్ ఆర్మూర్‌లోనే నివాసముంటూ, బావమరిది లాయక్ దగ్గరే సెంట్రింగ్ పనులు చేస్తూ ఉండేవాడు. కానీ మొయినుద్దీన్‌కు మద్యం అలవాటు ఉండటం వల్ల భార్యతో తరచూ గొడవలు జరిగేవి. కుటుంబ సభ్యులు, లాయక్.. ఎన్ని సార్లు చెప్పినా, పట్టించుకోకుండా తాగుడికి బానిసైపోయాడు మొయినుద్దీన్. దీంతో కళ్లెదుట కుమార్తె బాధలు చూసి లాయక్ తల్లిదండ్రులూ తపించిపోయేవారు.
చావరా అంటూ చెరువు దగ్గరే…
అయితే ఈ క్రమంలోనే ఈ నెల 23న భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరగడం, ఆ తర్వాత సద్దుమణగడం జరిగింది. ఆ వెంటనే బావమరిది లాయక్‌తో కలిసి రామన్నపేటకు పనికి వెళ్లాడు మొయినుద్దీన్. అయితే ఇంట్లో జరిగిన గొడవతో మనస్థాపానికి గురైన మొయినుద్దీన్ అక్కడే పురుగుల మందు తాగాడు. ఈ సందర్భాన్ని ఆసరాగా తీసుకున్న లాయక్, బావ చనిపోతే తన అక్క ప్రశాంతంగా ఉంటుందని భావించాడు. దీంతో తన బావను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా, మరో కార్మికుడు అబ్దుల్ జబ్బర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై సిరికొండ మండలంలోని మైలారం గ్రామ శివారులోని అయిలకుంట చెరువు వద్ద పడేసి వెళ్లిపోయాడు. దీంతో సమయానికి చికిత్స అందక మొయినుద్దీన్ మృతిచెందాడు.
గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. షేక్ లాయక్,అబ్దుల్ జబ్బర్.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం కేసును తక్కువ సమయంలోనే ఛేదించిన తమ అధికారులు సీఐ బిక్షపతి, సిరికొండ ఎస్సై రామకృష్ణతో సహా ఇతర సిబ్బంది ఏసీపీ అభినందించారు.


