Weather Forecast Update: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద శనివారం తీరం దాటింది. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రస్తుతం దక్షిణ ఒడిశా-ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఉంది. ఆదివారం నాటికి ఇది మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని తెలిపింది. ఈ వాయుగుండం కేంద్రం నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గోవా వరకు 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. దసరాకు వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
అత్యధికంగా 15.1 సెంటీమీటర్ల వర్షపాతం: గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు వికారాబాద్ జిల్లాలోని మోమిన్‌పేటలో అత్యధికంగా 15.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన అతి భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద పోటెత్తింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య మెదక్ జిల్లా లింగంపల్లిలో 10.4 సెం.మీ., సంగారెడ్డి జిల్లా మానూరులో 9.2 సెం.మీ., వరంగల్ జిల్లా మేడిపల్లిలో 9.1 సెం.మీ., ఆసిఫాబాద్‌లో 6.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
పొంచి ఉన్న మరో ముప్పు: ఈ నెల 30 నాటికి ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో అక్టోబరు 1 నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, పాత, శిథిలావస్థకు చేరిన భవనాల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నందున.. ప్రజలు ముందస్తుగా సిద్ధంగా ఉండాలి. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అధికార యంత్రాంగం అప్రమత్తం: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను మరియు విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం బృందాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే సహాయ శిబిరాలను ఏర్పాటు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులు కూడా తమ పంటలను జాగ్రత్తగా చూసుకోవాలని.. వర్షాల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


