తూర్పు గోదావరి జిల్లా,నల్లజర్ల మండలం దూబచర్లలో అంబేద్కర్(Amberker) విగ్రహానికి అవమానం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఈ అవమానం చేశారు దుండగులు.
దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించారు గ్రామస్తులు, దళిత సంఘాల నేతలు.నిందితుల కోసం డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు పోలీసులు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ విగ్రహానికి రక్షణ లేకుండా పోయిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మాల మహానాడు కార్యకర్తలు దండను తొలగించి విగ్రహానికి పాలతో అభిషేకాలు చేశారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. ప్రజలు, ఆయా వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించేవారిపట్ల అత్యంత కఠిన వ్యవహరించాలన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని అన్నారు.
పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు గోపాలపురం ఎమ్మెల్యే ఎంఎం వెంకట రాజు ఈ చర్యను ఖండిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. నల్లజర్ల సిఐ విజయ శంకర్ నేతృత్వంలోని పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, ఆధారాలు, వేలిముద్రలను సేకరించారు.