Iran Supreme Leader Warns US : ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరిన వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను బేషరతుగా లొంగిపోవాలని హెచ్చరించారు. దీనిపై ఘాటుగా స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, అమెరికాకు ‘కోలుకోలేని నష్టం’ జరగవచ్చని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడి చేస్తే, అమెరికాకు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఇరాన్‌ను కాపాడుకునేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఈ విషయంలో ఇరాన్ జాతి ఐక్యంగా ఉందని అని ఖమేనీ స్పష్టం చేశారు.
ఖమేనీ స్టిల్ ఇమేజ్‌తో ప్రసారం : ఈ వ్యాఖ్యలు ఇరాన్ జాతీయ టెలివిజన్ ద్వారా ఖమేనీ స్టిల్ ఇమేజ్‌తో ప్రసారం కాగా, ఆయనే ప్రత్యక్షంగా కనిపించకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఇప్పటికే 86 ఏళ్ల వయసున్న ఖమేనీ, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తరువాత ఒక్కసారి మాత్రమే బయట కనిపించారు.
ఖమేనీ బంకర్లో..? అమెరికా బెదిరింపులకు ఘాటు ప్రతిస్పందన : అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ రహస్య బంకర్లో దాక్కున్నారని వ్యాఖ్యానించగా, కొద్దిసేపటిలోనే ఖమేనీ ఎక్స్ వేదికగా స్పందించారు. “ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం చేస్తే, దానికి తీవ్రమైన దుష్పరిణామాలు తప్పవు. ఇరాన్ బెదిరింపులకు లొంగదు” అని ఖమేనీ హెచ్చరించారు. అమెరికా ఒత్తిళ్లకు లొంగే ప్రశ్నే లేదని స్పష్టం చేస్తూ, ఇరాన్ ప్రజలు ఐక్యంగా తమ దేశ రక్షణకు సిద్ధంగా ఉన్నారని ఖమేనీ తెలిపారు.
ఇజ్రాయెల్ నిరంతర దాడులు – ఇరాన్‌కు తీవ్ర నష్టాలు : ఇరాన్ అణు కార్యక్రమాన్ని అణిచివేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ గత ఆరు రోజులుగా భారీ స్థాయిలో సైనిక చర్యలు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 600 మంది మరణించారు, వీరిలో 585 మంది వరకు ఇరాన్ పౌరులే అని సమాచారం.
హెచ్చరికలు : ఇరాన్‌పై బేషరతుగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. ఖమేనీ రహస్య బంకర్లో దాక్కున్నారని, అతనిని హతమార్చే అవకాశం ఉన్నదని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి ఖమేని స్పందిస్తూ.. ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ లొంగదని తెలుపుతూ… ఒకవేళ అమెరికా జోక్యం చేసుకుంటే దానికి అనూహ్యమైన నష్టం తప్పదని హెచ్చరించారు.