Monday, December 4, 2023
HomeNewsIs Unemployment growing?: నిరుద్యోగం పెరుగుతోందా? తగ్గుతోందా?

Is Unemployment growing?: నిరుద్యోగం పెరుగుతోందా? తగ్గుతోందా?

మారుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ

ఇది స్థూల జాతీయోత్పత్తిని పునస్సమీక్షించాల్పిన రోజులు. అనేక సంస్థలు ఇప్పటికే స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి) అనేక పర్యాయాలు సమీక్షించి, ఇది6.2 నుంచి 6.7 స్థాయిలో ఉందని తేల్చి చెప్పాయి. చైనా, బ్రిటన్‌, మరికొన్ని అగ్రరాజ్యాలు, ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక మాంద్యం అంచుల వరకూ వెళ్లి కుంగిపోతున్న స్థితిలో ఉండగా, భారతదేశం మాత్రం ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకుని, స్థిరంగా పురోగతి సాధించడం జరుగుతోంది. ఆర్థికంగా చివరి త్రైపాక్షికంలో కూడా భారత్‌ 6.7 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతుందనే ఆర్థికవేత్తలు ఆశిస్తున్నారు. గత త్రైపాక్షికం కంటే మరింతగా పురోగతిసాధించే అవకాశం ఉందని కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. పర్వదినాల సీజన్‌ అయినందు వల్ల దేశీయంగా కొనుగోళ్లు, అమ్మకాలు బాగా పెరిగి ఉండే అవకాశంఉంది. ఇందుకు తగ్గట్టుగానే ప్రైవేట్‌ పెట్టుబడులు, ప్రభుత్వ మూలధన వ్యయంకూడా పెరుగుతూ పోతే, నిలకడగా ఆర్థికాభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన చివరి భాగం కూడా ఆర్థికంగా ఊపందుకోవడం జరుగుతుంది. అయితే, ఇక్కడొక విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంటోంది. దేశం ఎంతగా ఆర్థికాభివృద్ధి చెందుతున్నప్పటికీ, నిరుద్యోగ సమస్యకు మాత్రం పరిష్కారం లభ్యం కావడం లేదనే అభిప్రాయం సర్వత్రా నెలకొని ఉంది. సి.ఎం.ఐ.ఇ అనే ప్రైవేట్‌ సంస్థ అంచనాల ప్రకారం, గత సెప్టెంబర్‌ నెలలో 7.09 శాతం ఉన్న నిరుద్యోగ సమస్య, అక్టోబర్‌ నాటికి 10.05కు చేరుకుంది. ఇది కాస్తంత ఆందోళన కలిగించే విషయమే. 2021 మే నెల తర్వాత నిరుద్యోగం ఈ శాతానికి పెరగడం చిన్న విషయమేమీ కాదు. నిరుద్యోగ సమస్య విషయంలో చాలాకాలం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. దేశంలో ఉద్యోగాలు సృష్టించడమన్నది కనీ వినీ ఎరుగని స్థాయికి చేరుకుందని ఆయన వివరించారు. అంతేకాక, నిరుద్యోగ సమస్య కూడా గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయిందని కూడా ఆయన చెప్పారు. ఎన్నికల ముందు ప్రధానమంత్రి ఇటువంటి ప్రకటనలు చేయడం సహజమేనని అంతా భావించే అవకాశం లేక పోలేదు కానీ, అధికారిక లెక్కలు, ప్రైవేట్‌ ఏజెన్సీల సర్వేలు కూడా దీన్ని నిర్ధారిస్తున్నాయి. 2022 జూలై నుంచి 2023 జూన్‌ వరకు నిరుద్యోగ సమస్య 3.7 శాతానికి తగ్గిపోయిందని, గత ఆరేడేళ్ల కాలంలో నిరుద్యోగ సమస్య ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి అని ప్రైవేట్‌ ఏజెన్సీలు కూడా చెబుతున్నాయి. 2017-18లో మాత్రం నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయిందని లేబర్‌ ఫోర్స్‌ సర్వేలో వెల్లడైంది. ఆర్థికంగా కోలుకుంటున్నప్పుడు దీని ఫలితాలు పట్టణాలు, నగరాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ అందరికీ అందాలి. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య పట్టణాలు, నగరాల కంటే 40 శాతం ఎక్కువగా ఉన్నట్టు సి.ఎం.ఐ.ఇ తెలియజేసింది. మారుతున్న తీరుతెన్నులు వాస్తవానికి, ఈ డిజిటల్‌ యుగంలో, ముఖ్యంగా టెక్నాలజీ విశేషంగా అభివృద్ధి చెందుతున్న కాలంలో సరికొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతూనే ఉందని లేబర్‌ & టెక్నాలజీ సర్వే సంస్థ తెలియజేసింది. ఇదివరకటి మాదిరిగా కాకుండా, ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడం ఎక్కువైందని, స్వయం ఉపాధి కూడా పెరిగిపోయిందని అది గణాంకాలతో సహా తెలియజేసింది. ఈ ఉద్యోగాలు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల సర్వేల కిందకు రావడం లేదని, ఇవి ఒక రకంగా నికరమైన, లాభదాయకమైన ఉద్యోగాలేనని అది తెలియజేసింది. టెక్నాలజీ పరంగా ప్రజల జీవితాలు మారిపోతున్న తరుణంలో కొత్త రకాల ఉద్యోగాల సృష్టి జరిగిపోతోందని, ఎవరికి వారు ఏదో ఒక ఉద్యోగాన్ని సృష్టించుకోవడం కూడా జరుగుతోందని అది తెలిపింది. రాష్ట్రాల స్థాయిలో ఉపాధి కల్పనా కేంద్రాలలో నమోదు చేసుకోవడం కూడా బాగా తగ్గిపోయిందని అది తెలిపింది. పట్టణాలు, నగరాల్లో ఏ కొద్ది నైపుణ్యం ఉన్నా, కొద్దిపాటి చదువులు ఉన్నా నిరుద్యోగం నుంచి యువతీ యువకులు బయటపడుతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాల సృష్టి అనేది మొదటి నుంచీ తక్కువగానే ఉంటూ వస్తోందని నేషనల్‌ ఎంప్లాయ్‌ మెంట్‌ సర్వే సంస్థలు ఇటీవల ఒక సమగ్ర సర్వేలో తెలియజేశాయి. ఈ కారణంగానే గ్రామాల్లో చదువుకుని, పట్టణాల్లో ఉద్యోగాల కోసం వలసలు రావడం ఎక్కువైందని కూడా అవి తెలిపాయి. ఉద్యోగ సృష్టికి ప్రయత్నాలు ప్రధానితో సహా కేంద్ర మంత్రులు విదేశాల్లో పర్యటనలకు వెళ్లినప్పుడల్లా తప్పకుండా ఉద్యోగాల సృష్టికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది. విద్యావంతులైన యువతీ యువకులు విదేశాల్లో చదువుకుని, ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశాలను, మార్గాలను మెరుగుపరచడం జరుగుతోంది. ఆ యువతీ యువకులలో విదేశాల్లో ఉద్యోగ భద్రతమ ఉండడానికి కూడా కేంద్రం ప్రయత్నాలు సాగిస్తుంటుంది. ఈ మేరకు ఆయా దేశాల అధినేతలతో, సంబంధిత మంత్రులతో ఒప్పందాలు కుదర్చుకోవడం జరుగుతుంది. అంతేకాక, విదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానించడంతో పాటు, విదేశీ సంస్థలు భారతదేశంలో కంపెనీలు ప్రారంభించడానికి కూడా క్రమం తప్పకుండా ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. ఇటువంటి ప్రయత్నాలకు ఆశించిన స్థాయిలో ప్రచారం జరగకపోవడం వల్ల ప్రభుత్వం ద్వారా ఉద్యోగాల సృష్టికి ప్రయత్నాలు జరగడం లేదనే అభిప్రాయం ఏర్పడుతోంది. నిరుద్యోగాన్ని మదింపు చేసే ప్రక్రియల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందని, నిరుద్యోగానికి సంబంధించిన నిర్వచనం కూడా మారాల్సిన అవసరం ఉందని సర్వే సంస్థలు సైతం సూచిస్తున్నాయి. లేబర్‌ ఫోర్స్‌ సర్వే ప్రకారం, దేశంలో ప్రస్తుతం అతి తక్కువ నాణ్యత కలిగిన ఉద్యోగాలు, లాంఛన ప్రాయమైన ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది. వ్యవసాయేతర రంగాలలో ఇటువంటి లాంఛన ప్రాయమైన, గుర్తింపు లేని ఉద్యోగాల సంఖ్య పెరుగుతోందని, పురుషులతో పాటు, మహిళలు కూడా ఇటువంటి ఉద్యోగాల్లో చేరడం ఎక్కువైందని ఈ సంస్థ తెలియజేసింది. ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేసేపక్షంలో నాణ్యమైన ఉద్యోగాల సృష్టి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ, అనేక దశాబ్దాల నుంచి ఈ రంగం మీద ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదు. నిజానికి, ఒకవేళ ఉత్పత్తి రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందినప్పటికీ, టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతుండడం, యాంత్రికత పెరిగిపోతుండడం వంటి కారణాల వల్ల ఉద్యోగాల సృష్టి మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. భారతదేశం వంటి అతి పెద్ద దేశంలో, భారీ జనాభా కలిగిన దేశంలో నిరుద్యోగ సమస్య కాస్తో కూస్తో ఉండడం అనేది సహజమైన విషయమే. ఎన్నికల్లో నిరుద్యోగ సమస్య ఒక ప్రధాన ప్రచారాంశంగా మారుతుందో లేదో తెలియదు కానీ, భారతదేశం వంటి మధ్యస్థాయి ఆర్థిక వ్యవస్థలో రాశిలో కంటే వాసిలో ఉద్యోగాలు పెరగాల్సిన అవసరం ఉంది.

  • జి. రాజశుక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News