వేసవికాలం అనగానే ఒళ్లు మండే వేడి, అలసట, జలదాహం లాంటి సమస్యలు వెంటనే గుర్తుకువస్తాయి. ఈ కాలంలో శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. అలాంటి సమయంలో మనం తీసుకునే ఆహారం పాత్ర చాలా కీలకం. ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహజంగా లభించే కొన్ని పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. వాటిలో పనసపండు ముందుండేది. రోజూ పనసపండును తినడం వల్ల శరీరానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది.
పనసపండు తింటే జీర్ణక్రియ బాగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి, ప్రేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. వేసవిలో జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపించే పరిస్థితుల్లో ఇది సహజ పరిష్కారంగా మారుతుంది. ఇక రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ దాడి నుంచి కాపాడి, దీర్ఘకాలిక వ్యాధుల రాకను నిరోధిస్తాయి. వేసవిలో వైరల్ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపించే సందర్భంలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో పనసపండు కీలక పాత్ర పోషిస్తుంది.
పొటాషియం అధికంగా లభించేది ఈ పనసలోనే. ఇది సోడియంను సమతుల్యం చేసి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది సహజమైన ఔషధంలా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఇది చక్కటి పరిష్కారంగా నిలుస్తుంది. అలాగే రక్తహీనతతో బాధపడేవారికి పనసపండు ఓ వరం లాంటిది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటంతో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల అలసట, బలహీనత వంటి సమస్యలు తగ్గిపోతాయి.
చర్మానికి తేజ్ అందించడంలో కూడా పనసపండు చక్కటి సహాయకారి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని పాడుచేసే మాలిన్యాల నుంచి రక్షిస్తూ, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. యవ్వనాన్ని నిలబెట్టడంలో సహాయపడతాయి. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే సహజంగా లభించే అతి ముఖ్యమైన పండ్లలో పనసపండు ముందుంటుంది. ప్రతి రోజు కొద్దిమేర తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలన్నీ లభించి, రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు, జీర్ణవ్యవస్థ, గుండె, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.