ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఝలక్ తగిలేలా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకంజలో ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరుకుంటున్న ఈ క్షణంలో కేజ్రీవాల్ ఇంకా వెనుకంజలో ఉన్నారు. 1200 ఓట్లతో ఆయన వెనుకంజలో ఉండటం ఆప్ కు షాక్ గా మారింది. చివరి క్షణం వరకు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్న ఆప్ ప్రస్తుతం తమ కీలక నేతలంతా వెనుకంజలో ఉండటంతో శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది.
చావో రేవో అనేలా ఈ ఎన్నికలు
మూడు సార్లు సీఎంగా ఢిల్లీ అసెంబ్లీని ఏలిన అరవింద్ కేజ్రీవాల్ తన గెలుపు కోసం ఈసారి చాలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కాగా పలు ఈడీ, అవినీతి కేసుల్లో చిక్కుకున్న కేజ్రీవాల్ కోర్టులు, బెయిలు, జైలు మధ్య రోజులు గడుపుతూ, ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సంకట స్థితిలో చిక్కుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కేజ్రీవాల్ గెలవకపోతే ఆయన వ్యక్తిగత పొలిటికల్ కెరీర్ తో పాటు పార్టీ పరిస్థితి కూడా అగాధంలోకి కూరుకుపోవటం ఖాయమని పార్టీ ఆందోళనలో ఉంది.
అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని చెప్పుకున్న ఆప్ చివరికి అదే అవినీతి ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోవటం విశేషం. లిక్కర్ కుంభకోణంతో ఆప్ చావుదెబ్బ తినే దుస్థితిలోకి వెళ్లింది.