Parliament Session Begins From : పార్లమెంటు ఆవరణలో మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టించేందుకు రంగం సిద్ధమైంది! జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. కీలక బిల్లుల ప్రవేశం, విపక్షాల డిమాండ్ల నేపథ్యంలో.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఎజెండాలో ఏముందో తెలుసుకుందాం..!
వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు: జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నన్నారు. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా ఆగస్టు 13, 14 తేదీలలో సభ నిర్వహణ ఉండదని తెలిపారు. ముందుస్తు ప్రణాళిక ప్రకారం ఆగస్టు 12తో ముగియాలని భావించిన సమావేశాలను ఒక వారం పాటు పొడిగించడం గమనార్హం.
అణుశక్తి రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి పచ్చజెండా : ఈ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని అత్యంత కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.అందులో ప్రధానంగా అణుశక్తి రంగంలో ప్రైవేటు రంగానికి మార్గం సుగమం చేసే చట్ట సవరణలు ఉన్నాయి. ‘సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్’, ‘అటామిక్ ఎనర్జీ చట్టం’ లలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన అణు రంగ ఆధునీకరణ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ మార్పులు అత్యవసరం అని అధికారులు చెబుతున్నారు.
విపక్షాల డిమాండ్లు: ప్రతిపక్షం గళం విప్పుతుందా : వర్షాకాల సమావేశాలకు ముందే ప్రతిపక్షాలు తమ డిమాండ్లను గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో ప్రత్యేకంగా చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-పాక్ మధ్యవర్తిత్వంపై చేసిన వ్యాఖ్యలపై స్పష్టత కోరుతున్నాయి. ట్రంప్-ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని పట్టుబడుతున్నాయి. ఈ డిమాండ్ల నేపథ్యంలో సమావేశాలు తీవ్ర వాగ్వాదాలకు, నిరసనలకు వేదికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
గత సమావేశాల్లో ఏం సాధించారు : 2025లో జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ‘వక్ఫ్ సవరణ బిల్లు’ ఉభయసభల్లోనూ ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదంతో ఏప్రిల్ 8న అమల్లోకి వచ్చింది. అలాగే, ‘త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు 2025’ కూడా ఆమోదం పొందింది. ఈ సమావేశాలు కీలక చట్టాలకు బీజం వేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.