ఏడు పదుల వయసులోనూ 2800 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన శిరుగుప్ప వాసి అందరినీ విస్మయపరుస్తున్నారు. శిరుగుప్ప నుంచి వారణాసికి పాదయాత్ర సాగింది. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా శిరుగుప్పకు చెందిన గోపాలకృష్ణ 68 సంవత్సరాల వయస్సులో కూడా 2800 కి. మి పాదయాత్రను విజయవంతం చేశారు.
శిరుగుప్ప నుంచి వారణాసికి పాదయాత్ర చేసి ఔరా అన్పించారు. శిరుగుప్ప నుంచి ఫిబ్రవరి 22వ తేదిన బయలుదేరి ప్రతి రోజు 15 కి. మీ చొప్పున ఆగస్టు 15వ తేది నాటికి వారణాసి చేరుకున్నారు. అయితే మార్గమధ్యంలోని దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన వసతి, భోజనం ను స్వీకరించి పాదయాత్ర కొనసాగించారు.
ఈ యాత్ర పండరిపుర్, ఉజ్జయిని, మహాకాళేశ్వర్, షిర్డీ, త్రయంబకేశ్వర్, ప్రయాగ రాజ్ చుట్టూ పక్కల ఉన్న దేవాలయాలు మీదుగా వారణాసి వరకు సాగింది. 9 రోజుల పాటు వారణాసి క్షేత్రంలో కాశీ విశ్వనాథ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుని భక్తుల సహాయ సహకారాలతో వారణాసి నుంచి బెంగుళూరుకు విమాన ప్రయాణం ద్వారా చేరుకున్నారు. అక్కడ నుంచి సమీప బంధువులు కారులో మంత్రాలయం తీసుకుని వచ్చారు.
మంత్రాలయం చేరుకున్న గోపాలకృష్ణకు ఆర్యవైశ్య సత్రం సూపర్ వైజర్ వై. లక్ష్మయ్య శెట్టి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. గోపాలకృష్ణకు పాద పూజ నిర్వహించి శాలువ కప్పి సన్మానించారు. లోక కల్యాణర్థాం ఈ యాత్ర చేసినట్టు గోపాలకృష్ణ వివరించారు.