కేంద్ర బడ్జెట్ 2025లో పన్ను తగ్గింపును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. మధ్యతరగతి ప్రజలు ఎల్లప్పుడూ ప్రధాని మోదీ హృదయంలో ఉంటారని ఆయన అన్నారు. రూ.12 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి పన్నులో పూర్తి మినహాయింపు ఇవ్వడాన్ని ఆయన కొనియాడారు. పన్ను శ్లాబులను పునఃసమీక్షించడం మధ్యతరగతి ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులందరికీ ఆయన అభినందనలు తెలుపుతూ.. ట్విటర్ లో పోస్ట్ చేశారు.
వికసిత్ భారత్ 2047: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలకు ఆదాయ పన్ను మినహాయింపులతో పాటు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించారు. మొత్తంగా రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ. 34,20,409 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ. 16,44,936 కోట్లుగా ఉండబోతున్నట్లు తెలిపారు.
పన్ను శ్లాబుల్లో కీలక మార్పులు: ఇక కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పన్ను శ్లాబుల్లో కీలక మార్పులు చేసింది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్ కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపులు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మధ్య తరగతి ప్రజలు, వేతన జీవులకు భారీ ఊరట లభించినట్లయింది. కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ శ్లాబుల్లో కీలక మార్పులు చేశారు. పన్ను రిబేట్‌తో కలిపి రూ.12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు.
కొత్త పన్ను విధానం: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు కేంద్ర బడ్జెట్ 2025 ను ప్రవేశపెడుతూ, కొత్త పన్ను విధానంలో రూ .12 లక్షల వరకు.. అంటే స్టాండర్డ్ డిడక్షన్లతో సహా రూ .12.75 లక్షల వరకు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. సవరించిన శ్లాబుల ప్రకారం రూ.4 లక్షల లోపు ఆదాయంపై పన్ను ఉండదు. రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుంది. రూ.8 నుంచి రూ.12 లక్షల మధ్య 10 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల మధ్య 15 శాతం, రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య 20 శాతం, రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య 25 శాతంగా ఉంటుంది. రూ.24 లక్షలకు పైబడిన ఆదాయం 30 శాతం పన్ను పరిధిలో ఉంటుంది.