Tuesday, November 26, 2024
HomeNewsNirmal: 52 జంటలను కలిపిన పోలీసులు

Nirmal: 52 జంటలను కలిపిన పోలీసులు

ఖాకీల భరోసా

చిన్న చిన్న సమస్యలతో క్షణికావేశంతో దూరమై నిండు జీవితాలను దూరం చేసుకున్న దాదాపు 52 జంటలను ఏకం చేసి మహిళలకు భరోసా కల్పిస్తున్నారు నిర్మల్ జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీగా జానకి షర్మిల పదవీ బాధ్యతలు స్వీకరించాక మహిళలకు ఆలంబనగా భరోసా కేంద్రాన్ని నెలకొల్పారు.

- Advertisement -

స్వయంగా చొరవ తీసుకున్న ఎస్పీ జానకి షర్మిల

మనస్పర్థలతో, కుటుంబ కలహాలతో దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులకు, భార్యా భర్తలకు మానసిక నిపుణులు, మహిళా ఎస్ఐ పర్యవేక్షణలో కౌన్సెలింగ్ ఇప్పించి వారిని కలిపే ప్రయత్నం చేసేందుకు ప్రారంభించిన ఈ కేంద్రం సత్ఫలితాలు ఇస్తోంది. ఒకసారి చెపితే వినకపోయినా మళ్ళీ వారిని పిలిచి ఒకటిగా చేయటమే ధ్యేయంగా భరోసా కేంద్రం పనిచేస్తోంది. ఈ కేంద్రం కృషి ఫలితంగా ఇప్పటి వరకు 52 జంటలను ఏకం చేసి వారి కుటుంబ సభ్యుల ఆనందానికి కారణం అవుతున్నారు. వీరందరూ ఎస్పీ జానకి షర్మిల స్వీయ నేతృత్వంలో భరోసా కేంద్రానికి శుక్రవారం వచ్చి తమ అనుభవాలను పంచుకున్నారు.

ఓపికతో విన్న ఖాకీలు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపికతో తమ బాధలు వినటమే కాకుండా తమను ఒకటి చేయటానికి భరోసా సభ్యులు చేసిన ప్రయత్నాన్ని కొనియాడారు. తమ బాధలు కుటుంబ సభ్యులే వినకపోగా సమాజంలోని కొందరు సూటిపోటి మాటలతో మానసికంగా హింసిస్తున్న తరుణంలో భరోసా కేంద్ర సభ్యులు ఓపికతో నచ్చజెప్పి కుటుంబాలను నిలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ మహిళలకు, పిల్లలకు ఒకే చోట మెడికల్, న్యాయ సలహా, వైద్యం, కౌన్సిలింగ్, మానసిక సమస్యలను ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ రాష్ట్ర పోలీసు స్త్రీ, శిశు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో భరోసా సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. మహిళల భద్రతకు భరోసానిస్తూ, బాధిత మహిళలను, పిల్లలను అక్కున చేర్చుకొని, కొండంత ధైర్యాన్నిస్తూ, మహిళల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా భరోసా సెంటర్ సేవలు అందిస్తుందన్నారు.

సమస్య చెబితే చాలు..

జిల్లాలోని ఏ ప్రాంతం వారైనా పోలీసులను కుటుంబ సభ్యులుగా పరిగణించి సమస్య చెప్పుకుంటే తప్పకుండా సమస్యకి పరిష్కారాన్ని చూపేలా ప్రయత్నం చేయడంలో నిర్మల్ జిల్లా పోలీస్ యంత్రాంగం పని చేస్తుందనే నమ్మకం మీలో కలగాలి ఎందుకంటే దాంపత్య జీవితం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు పంచేలా ఉండాలి తప్పితే సమస్యల వల్ల విడిపోయి దూరంగా ఉండడం ఇరువురికి ఎంత బాధ కలిగిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు అని అందుకొరకై ఎలాంటి సమస్య వచ్చినా తప్పకుండా భరోసా సెంటర్ సిబ్బందిని గాని లేదా జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో వచ్చి చెప్పిన కూడా తప్పకుండా తోడుగా ఉండి సమస్యలను పరిష్కరించే దిశగా పని చేస్తామన్నారు. భరోసా సెంటర్ ద్వారా వివిధ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో, అత్యాచార కేసులలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, పోక్సో చట్టాల గురించి బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, బాలల అక్రమ రవాణా, బాలల అక్రమ దత్తత నిషేధమన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు, ఆర్ ఐ లు, ఎస్సైలు, ఆర్ఎస్ఐ లు, మహిళా ఎస్ఐ సుమాంజలి, సుమలత, జ్యోతిమణి, పెర్సిస్, జిల్లా పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు, భరోసా సెంటర్ సిబ్బంది, షి టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News