OG movie tickets Benefit Shows: పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు విషయంలో హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రేపు (గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ సినిమా బెనిఫిట్ షోలను నేటి (బుధవారం) రాత్రి నుంచి ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. అందేకాదు, టికెట్ల రేట్లను పెంచుకునేందుకు సైతం అనుమతిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ బుధవారం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ‘ఓజీ’ విడుదల నేపథ్యంలో టికెట్ ధరలను పెంచాలని కోరుతూ చిత్ర నిర్మాణ సంస్థ ప్రభుత్వాన్ని కోరగా, అందుకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మెమోను సవాల్ చేస్తూ మహేశ్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ సీఎస్‌కు ఎలాంటి అధికారాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని పోలీస్ కమిషనర్, జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్‌కు మాత్రమే మెమో జారీ చేసే అధికారం ఉందన్నారు. టికెట్లు అధిక ధరకు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘గేమ్ ఛేంజర్’ సందర్భంగా హోంశాఖ అండర్ టేకింగ్ కూడా ఇచ్చిందన్న అంశాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. ఈ వాదనలను పరిగణనలో తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ జారీచేసిన మెమోను సస్పెండ్ చేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేశారు. తెలంగాణలో టికెట్ ధరల పెంపు సహా ముందురోజు అనగా బుధవారం రాత్రి 10 గంటలకు ప్రీమియర్‌ను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీనికి టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.800. అలాగే సినిమా విడుదల రోజు (గురువారం) నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, హైకోర్టు తాజా తీర్పుతో టికెట్ల రేట్లు తగ్గే అవకాశం ఉంది.
Also Read: https://teluguprabha.net/news/botsa-satyanarayana-walkout-from-council/
మూవీపై భారీ అంచనాలు..
కాగా.. సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఓజీ సినిమాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు పలువురు స్టార్స్ నటించారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక కాగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే సీనియర్ నటి శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేక సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్ ఇలా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటించారు.. అలాగే డీజీ టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. పవన్ కల్యాణ్ చాలా కాలం తర్వాత నటించిన గ్యాంగ్ స్టర్ మూవీ ఓజీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


