సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు ప్రాణ హాని ఉందని , సుపారీ గ్యాంగులను రంగంలోకి దించారని తెలుస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాలతో బిజీ గా గడుపుతున్నారు. ఏపీలో మరో ఐదు , ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు మరింత దగ్గరై..ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. గత నాల్గు రోజులుగా వారాహి యాత్ర చేస్తున్న పవన్..కాకినాడలో శనివారం సాయంత్రం ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళలతో సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ..” అధికారం నిలబెట్టుకునేందుకు నాయకులు ఎంతకైనా తెగిస్తారు. బాలు సినిమా సమయంలో ఓ ఐపీఎస్ అధికారి నా దగ్గరకు వచ్చి మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్నారా అని అడిగారు.. ఎందుకు అని నేను అడిగితే మీ కుటుంబానికి కాస్త హాని తలపెట్టే అవకాశం ఉందని చెప్పారు. రాజకీయాల్లోకి మా కుటుంబం వస్తే అప్పట్లో అధికారంలో ఉన్న నాయకులకు భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని, మేం రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పించేందుకు మా ఇంటి ఆడబిడ్డల మీద విపరీతమైన దుష్ర్పచారం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రాజకీయాల్లో పదవి పోతుందనే భయం చాలా చెడ్డది. తమకు హానీ చేస్తారని తెలిస్తే, కడుపులోని బిడ్డను కూడా చంపేందుకు వెనుకాడరు ” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం జనసేన పార్టీ బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. అధికారం నుంచి వైసీపీ పాలకులను గద్దె దించే దిశగా పయనిస్తోంది. ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారు. తనకు ప్రాణహాని ఉంది. సుపారీ గ్యాంగులను ప్రత్యేకంగా దింపారనే సమాచారం ఉంది. కచ్చితంగా భద్రతా నియమాలను నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు తప్పనిసరిగా పాటించాలి అంటూ పార్టీ శ్రేణులను హెచ్చరించారు. నేటి వైసీపీ పాలకులు అధికారం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమే. కానీ తనను భయపెట్టే కొలది తాను మరింత రాటు దేలుతాను అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.