ఏపీ పాలిటిక్స్ లో రియల్ విన్నర్, రియల్ హీరో, పొలిటికల్ పవర్ స్టార్, పొలిటికల్ హీరోగా జనసేన అధినేత పవన్ కల్యాణే. ఇదే జనం మాట, ఇదే మీడియా మాట, ఇదే సోషల్ మీడియా మాట, ఇదే రాజకీయ పండితుల మాట కూడానూ. పదేపదే ఓటమి వెక్కిరించినా వెనుదిరకుండా అలుపెరుగని పోరాటం చేసి, 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 20 స్థానాల్లో దూకుడు ప్రదర్శిస్తోందంటే అది పవన్ పోరాటానికి నిలువెత్తు రూపం కూడానూ.
తన సొంత వ్యక్తిత్వం, వ్యక్తిగత వైవాహిక జీవితంపై కూడా ఎంత గేళిచేసినా పోరాటపటిమను కోల్పోని పవన్ పొలిటికల్ గా తన సత్తా ఏంటో చాటారు. ఆఖరుకి వైసీపీ కంటే కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఆయన గెలిపించుకోవటం మరో ట్విస్ట్. పవర్ స్టార్ నిజంగానే పొలిటికల్ పవర్ స్టార్ గా మార్చింది 2024 ఎన్నికలే.
వైసీపీ ఓటమిలో, కూటమి విజయంలో పవన్ పోషించిన పాత్ర చాలా పెద్దది. విస్తృతంగా ప్రచారం చేయటంతో పాటు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా, క్రౌడ్ పుల్లర్ గా ఎన్నికల ప్రచారం చేసిన స్టార్ క్యాంపెయినర్ గా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పవన్ ఎట్టకేలకు అసెంబ్లీలో తొలిసారి అడుగు పెట్టబోతున్నారుకూడా. కాపుల ఓట్లు పోలరైజ్ అయ్యేలా చేయటంలో పవన్ దే కీలక పాత్ర. మొత్తానికి జగన్ పై తనకున్న అక్కసును పవన్ కల్యాణ్ తీర్చుకున్నట్టైందని రాజకీయ పండితులు పవన్ ను ప్రశంసిస్తున్నారు.
పవన్ రాజకీయాల్లో ఎట్టకేలకు కుదురుకున్నారని జనసేన అభిమానులు, కాపు కులస్థులు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంలో తేలియాడుతున్నరోజు ఇదే. ఇక పవన్ పొలిటికల్ స్టార్ లా దూసుకుపోవటం ఖాయమని, పవన్ ఇక సీరియన్, సీజన్డ్ పొలిటీషియన్ గా ఎదగటం ఖాయమనే అంచనాలు అప్పుడే ఆయన అనుచరగణం, ఫ్యాన్స్ లో మొదలవ్వటం అసలు హైలైట్.