Saturday, October 12, 2024
HomeNewsPlastic the biggest enemy of the nation: దేశాన్ని పీడిస్తున్న సరికొత్త భూతం

Plastic the biggest enemy of the nation: దేశాన్ని పీడిస్తున్న సరికొత్త భూతం

ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరువలో మనం..

దేశాన్ని ప్రస్తుతం ప్లాస్టిక్‌ భూతం ఆవహిస్తోంది. ప్లాస్టిక్‌ వస్తువుల కాలుష్యానికి సంబంధించి భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటోంది. ప్లాస్టిక్‌ కాలుష్యం విషయంలో ఇంత వరకూ అగ్రస్థానంలో ఉంటూ వస్తున్న చైనాను భారత్‌ మించిపోయే పరిస్థితి ఏర్పడింది. అతి సమీప భవిష్యత్తులో ప్లాస్టిక్‌ వస్తువుల గుట్టల కింద భారత్‌ ఉక్కిరిబిక్కిరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారతదేశంలో ఏటా 93 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు విడుదల అవుతున్నాయని అంచనా. ప్రపంచం మొత్తం మీద విడుదలవుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలలో ఇది అయిదవ వంతు. ప్లాస్టిక్‌ వ్యర్థాల విషయంలో అగ్రస్థానంలో ఉన్న ఇతర దేశాల కంటే మూడు రెట్లు అధికంగా భారతదేశం ప్లాస్టిక్‌ వ్యర్థాలను విడుదల చేయడం జరుగుతోంది. ఇటీవల లీడ్స్‌ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు జరిపి విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. మరికొన్ని అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలు కూడా ఇదే విషయాలను ధ్రువీకరిస్తున్నాయి.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సి.పి.సి.బి) తన 2021-22 సంవత్సర నివేదికలో భారత దేశంలో ఏటా నలభై లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. నిజానికి ఈ గణాంకాలు పూర్తిగా సరైనవి కాకపోవచ్చు. దేశంలోని అనేక గ్రామాల్లో ఏ మేరకు ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నది సరైనా అంచనాలు లభ్యం కావడం లేదు. భారతదేశంలోని గ్రామాల్లో అశాస్త్రీయ పద్ధతుల్లో ప్లాస్టిక్‌ను తగలబెట్టడం జరుగుతుం టుందని, ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఒక చోట పోగు చేయడం అంటూ జరగదని లీడ్స్‌ యూనివర్సిటీ నివేదిక కూడా తెలియజేసింది. నగరాల విషయానికి వస్తే భారతదేశంలోని నగరాలన్నిటిలోనూ ఢిల్లీ ప్లాస్టిక్‌ వ్యర్థాల విషయంలో అగ్రస్థానంలో ఉంది. ప్లాస్టిక్‌ వ్యర్థాల గురించి ఆందోళన చెందడం ఇదేమీ కొత్త కాదు. ఇదొక సర్వ సాధారణ విషయంగా, ఆనవాయితీ వ్యవహారంగా మారిపోయింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు ప్రతి ఏటా పెరగడమే తప్ప తగ్గే వ్యవహారంగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్న చైనా ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాల రీసైక్లింగ్‌ భారీ ఎత్తున జరుగుతోంది. భారతదేశం కూడా ప్లాస్టిక్‌ వ్యర్థాల దహనానికి ఆధునిక పద్ధతులను అనుసరించడంతో పాటు, రీసైక్లింగ్‌ వ్యవస్థలను పెంచాల్సిన అవసరం ఉంది.
ప్లాస్టిక్‌ వ్యర్థాలు పెరిగే పక్షంలో ప్రజారోగ్యం దెబ్బతింటుంది. పర్యావరణానికి ప్రమాదం ఏర్పడు తుంది. అభివృద్ధిని ఆటంకపరుస్తుంది. సూక్ష్మస్థాయి ప్లాస్టిక్‌ పదార్థాలు మన శరీరాల్లోకి ప్రవేశించి ఊపిరితిత్తుల్ని, జీర్ణాశయాన్ని దెబ్బ తీస్తాయని ఇటీవల కొన్ని వైద్య నివేదికలు కూడా హెచ్చ రించడం జరిగింది. ముఖ్యంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను దగ్ధం చేస్తున్నప్పుడు ప్లాస్టిక్‌ వాయువులు శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సంపన్న దేశాలతో పోలిస్తే వర్ధమాన దేశాలు, పేద దేశాలకు ప్లాస్టిక్‌ వ్యర్థాల ముప్పు ఎక్కువగా ఉంటోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎదుర్కోగల సాధన సంపత్తి వర్ధమాన దేశాలు, పేదదేశాల్లో అతి తక్కువ స్థాయిలో ఉంటోంది. అయితే, ప్లాస్టిక్‌ వ్యర్థాల ప్రమాదం ఏ దేశాన్ని ముంచెత్తినా అది ప్రపంచానికంతటికీ నష్టం కలిగించే అవకాశం ఉంది. అందువల్ల ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.
ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించడానికి, వాటిని తొలగించుకోవడానికి, రీసైక్లింగ్‌ చేసుకోవడానికి భారత దేశంలో అనేక నియమ నిబంధనలు అమలులో ఉన్నాయి. ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ రూల్స్‌, ఎక్స్‌ టెండె్‌డ ప్రొడ్యూసర్‌ రెస్పాన్సిబిలిటీ రూల్స్‌ తదితర పేర్లతో ఉన్న ఈ నిబంధనలను ప్రతి ప్లాస్టిక్‌ తయారీదారు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వాలు అనేక ప్రక్రియలు, పద్ధతులను అందుబాటులో ఉంచడం కూడా జరిగింది. అయితే, ఇవేవీ ఒకపట్టాన అమలు జరగడం లేదు. ఈ నిబంధనలను అమలు చేయడంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. పైగా దేశంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించడానికి, తొలగించుకోవడానికి, రీసైక్లింగ్‌ చేసుకోవడానికి వనరులు, సౌకర్యాలు చాలినన్ని లేవు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను వదల్చుకోవడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక సమన్వయ, కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలకు సంబంధించిన నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా చర్యలు తీసుకుంటోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణకు చర్యలు తీసుకోవలసిన పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలు అనేక రాష్ట్రాల్లో అచేతనంగా ఉండిపోవడం వల్ల ఈ సమస్య ఒక పెనుభూతంలా మారిపోతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News