పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు(Budget Sessions)ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ(PM Modi) జాతిని ఉద్దేశించి మాట్లాడారు. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్(Union Budget) ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఏమన్నారంటే..
‘‘మహాలక్ష్మి మనకు సిద్ధి, బుద్ధి ప్రసాదిస్తుంది. పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కృప ఎప్పటికీ ఉండాలి. భారత శక్తి సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపును ఇస్తాయి. ప్రజల మద్దతుతో మూడోసారి పార్లమెంట్లో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. ఈ వార్షిక బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది. భారత్ అభివృద్ధికై ఇన్నోవేషన్, ఇన్క్లూజన్, ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంతో దూసుకెళ్తున్నాం. కొత్త విధానాలపైనే ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుంది. పార్లమెంటులో చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతున్నాం. పార్లమెంటు సమావేశాల్లో అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుంది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నాను’’ అని తెలిపారు.
కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతాయి. తొలి విడత ఫిబ్రవరి 13వ తేదీ వరకూ, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరగనున్నాయి.